రైతు సమన్వయ సమితుల్ని విమర్శించడం విడ్డూరం

రైతు సమన్వయ సమితులతో రాజకీయం చేస్తున్నామని విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గతంలో ఇందిరమ్మ కమిటీలను వేసి, జై తెలంగాణ అంటే ఇల్లు రాదని గొంతు నొక్కిన కాంగ్రెస్ వాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఆదర్శ రైతుల పేరిట ఏటా 500 కోట్లు కార్యకర్తలకు దోచి పెట్టిన చరిత్ర కాంగ్రెస్ దని విమర్శించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో జరిగిన గ్రామ, మండల రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సుల్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

ఎరువుల కొరత, విత్తనాల కొరత, పోలీస్ స్టేషన్లో ఎరువుల కోసం రైతుల లైను.. ఇదీ మనం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. రైతు సమన్వయ కమిటీలో ప్రతి రైతూ సభ్యుడేనని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ బాధ పోయిందని, నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రూ. 870 కోట్లతో రైతుల నుంచి ధాన్యం కొన్నామని, వెయ్యి కోట్లతో గిడ్డంగులను నిర్మించినమని మంత్రి వివరించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించి రైతుకు అందుబాటులో ఉంచినమని అన్నారు.

గోదావరి నీళ్లు పొలాలకు మళ్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాలం కలిసొస్తే ఏడాదిలోగానే సిద్దిపేట కాలువల్లో గోదావరి నీళ్లు పారుతాయని ప్రకటించారు. రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి రైతులకు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున పెట్టుబడి ఇస్తామంటే, కాంగ్రెస్ వాళ్లు కోర్టులకు వెళ్తూ రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నది రైతు పరిరక్షణ కమిటీలు కాదు, అవి రైతు భక్షణ కమిటీలని విమర్శించారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రైతు సమన్వయ సమితులు పని చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

రైతులు తమ బిడ్డలకు అప్పుల మూటను కానుకగా ఇచ్చి పోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు కారణం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,773 గ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈనాడు తీసుకున్న నిర్ణయం ఆనాడే తీసుకుని ఉంటే రైతుల పరిస్థితి ఇలా ఉండేదా? నిలదీశారు. లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని చెప్పారు.   గోదావరి, కృష్ణా జలాలను పొలాలకు తరలించి కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటి పది లక్షల ఎకరాలకు ఎకరాకు నాలుగు వేల పెట్టుబడి ఇస్తామని మంత్రి తెలిపారు.

అసంఘటితంగా ఉన్న రైతులను సమన్వయం చేయడానికే  రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పోచారం చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2630 వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని తెలిపారు.  ప్రభుత్వం తన పరిపాలన సౌలభ్యం కోసం సమన్వయ సమితులను నియమించుకుంటే తప్పేంటని కోర్టు పిటిషనర్లను ప్రశ్నించిందని మంత్రి వివరించారు. రైతుకు రంగు లేదు, కులం లేదు, మతం లేదు. భూములుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జానారెడ్డికి, జీవన్ రెడ్డికి కూడా ఎకరానికి 4 వేల చొప్పున ఇస్తామని మంత్రి పోచారం స్పష్టం చేశారు. రెండు, మూడేళ్ల తర్వాత ధనిక రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే పరిస్థితి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.