రైతు సంక్షేమానికి ప్రతిన

రాష్ట్రవ్యాప్తంగా రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో జోరుగా సాగుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు సదస్సుల్లో పాల్గొని సమన్వయ సమితుల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తామని ప్రమాణం చేస్తున్నారు.

టీఆర్ఎస్ సర్కారు అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటోందని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన అవగాహన సదస్సులో ఈటెల పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అన్నదాతలు బాగుపడటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని… అందుకే సమన్వయ సమితులను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సుకు మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అటు, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన అవగాహన సదస్సుకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఇతర నాయకులు, రైతులు హాజరయ్యారు.

రైతు సమన్వయ సమితులతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సమితుల ద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన అవగాహన సదస్సుకు తుమ్మల హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆళ్ళపల్లి, గుండాల మండలాల రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు మంత్రి మహేందర్‌ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ లో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు, తాండూరులో జరిగిన సదస్సులో మంత్రి మహేందర్‌ రెడ్డి, పలువురు నాయకులు భాగస్వాములయ్యారు. అటు, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా ఘట్కేసర్‌ లో అవగహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లా రాజాపూర్‌ లో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట, బిజినేపల్లి, నాగర్ కర్నూల్  గ్రామ, మండల సమన్వయ సమితుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

అన్నదాతలకు టీఆర్‌ఎస్ సర్కారు అన్ని విధాలా భరోసా ఇస్తుందని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండల కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్‌ ముఖ్య ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని చెప్పారు. నిజాంసాగర్‌ మండలంలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందల్‌ వాయి, సిరికొండ, దర్పల్లి మండలాల సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు.

రైతు సమన్వయ సమితులతో అన్నదాత బతుకు మారుతుందన్నారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌, పెద్దవంగర మండల రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో ఎర్రబెల్లి పాల్గొన్నారు. అటు, మరిపెడ మండలం గాలి వారిగూడెంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ హాజరయ్యారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో గీసుకొండ, పరకాల, సంగెం మండలాల రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పలువురు అధికారులు, నాయకులు ఇందులో పాల్గొన్నారు.

అన్నదాతల బాగు కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపడతున్నారని డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా రామాయంపేటలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో డిప్యూటీ స్పీకర్‌, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గ్రామ, మండల రైతు సమన్వయ కమిటీల అవగాహన సదస్సులో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పాల్గొన్నారు. వట్‌ పల్లి మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే బాబుమోహన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.