రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన

గతంలో పాలించినప్పుడు కనీసం కరెంట్ కూడా ఇవ్వని కాంగ్రెస్.. తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతోందని మంత్రి కృష్ణారావు చెప్పారు. ఇందులో భాగంగానే రైతు సమన్వయ కమిటీలకు శ్రీకారం చుట్టామన్నారు. సాగునీరు, పెట్టుబడి, మద్దతు ధర కల్పిస్తేనే రైతు సంక్షేమం సాధ్యమన్న మంతి, ఆ దిశగా రైతు సమన్వయ కమిటీలు పని చేయాలని సూచించారు. ఎలాంటి పంటలు సాగు చేస్తే లాభదాయకమో కూడా సమన్వయ కమిటీలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.