రైతుల కష్టాలు తీర్చేందుకే సమన్వయ సమితులు

రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. అన్నదాతల కష్టాలు తీర్చేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మెదక్‌ హవేలి ఘణపూర్‌ లో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో మంత్రులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతు సమన్వయ సమితి సభ్యులకు పలు సూచనలు చేశారు.

అన్నదాతల కష్టాలు తీర్చేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచడంతో పాటు ఎకరానికి 8 వేల పెట్టుబడి ఇవ్వాలని సంకల్పించారన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కారు అమలు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

అసంఘటితంగా ఉన్న అన్నదాతలను సంఘటితం చేసేందుకే… రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడంతో పాటు ఎకరాకు 8 వేల రూపాయల పెట్టుబడి ఇస్తున్నామని చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కొనియాడారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సమన్వయ సమితులదేనని మంత్రులు అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటైన సమితుల సభ్యులు అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు.