రెచ్చగొట్టినందుకే శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం

దళితుల సంక్షేమానికి ఏమీ చేయని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులే రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ ని విమర్శిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. చావుకు, పెళ్లికి ఒకే డప్పు వాయించినట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై దాడులు చేస్తుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 3న సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ముందు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం, అతన్ని కాపాడబోయిన పర్శరాములు గాయపడటం దురదృష్టకరమని మంత్రి ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పంపిణీ విషయంలో కొంత మంది రెచ్చగొట్టడంతోనే శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. జరిగిన సంఘటనపై సిద్దిపేట కలెక్టర్ తో విచారణ జరిపిస్తున్నామని, అందులో తమ పార్టీ వారు ఉన్నా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మూడేళ్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వ హయాంలో దళితుల కోసం ఒక్క స్కీం అయినా తీసుకొచ్చిందా రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి ఈటెల డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక దళితుల సంక్షేమం కోసం కళ్యాణలక్ష్మీ, హాస్టళ్లలో సన్నబియ్యం, మహిళలకు రెసిడెన్షియల్ కళాశాలలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

మీడియా సమావేశంలో మంత్రి ఈటెలతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.