రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు

రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించే విధానానికి సంబంధించి స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా విద్యుత్ సంస్థల అధికారులు విధి విధానాలు ఖరారు చేశారు. ఇప్పటికే నిర్ణయించిన వేతనాల పెంపుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఒక్కో ఉద్యోగికి నెలకు వెయ్యి రూపాయల నజరానాను కూడా వేతనంతో కలిపి ఇవ్వాలని నిర్ణయించారు.

నాలుగు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 23 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారిగా గుర్తించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఏజన్సీలతో సంబంధం లేకుండా నేరుగా జీతాలు చెల్లించే విషయంలో కోర్టు స్పష్టత ఇచ్చింది. సంస్థలు చెల్లించే జీతాలకు సంబంధించి కూడా సుముఖత వ్యక్తం చేసింది. మిగతా అంశాలకు సంబంధించి తుది తీర్పు రానుంది. ఈలోగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నష్టం కలగని విధంగా…. గతంతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా విద్యుత్ సంస్థలు కొత్త విధానాన్ని ఖరారు చేశాయి. తెలంగాణ విద్యుత్ సమన్వయ కమిటీలో సభ్యులైన ట్రాన్స్ కో- జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాసరావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాల్ రావు ఆమోద ముద్ర వేశారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏండ్ల తరబడి క్షేత్ర స్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నందున…. మానవత్వంతో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు తగు నిర్ణయాలు తీసుకున్నట్లు సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఈ నిర్ణయాలన్నీ హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. ఇకపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులకు లభించిన గౌరవం, కనీస వేతన చట్టం సూచించిన దాని కన్నా ఎక్కువ వేతనం దక్కుతాయని చెప్పారు. కాంట్రాక్టు ఏజన్సీలను రద్దు చేసినందున, వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా ఉద్యోగులకే అందించడం వల్ల వేతనాలు పెంపు సాధ్యమైందని.. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.వెయ్యి అదనంగా లభిస్తున్నదని తెలిపారు.

కొత్తగా రూపొందించిన వేతనాల విధానం ప్రకారం మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. గ్రేడ్ 1 లో హైలీ స్కిల్డ్ ఉద్యోగులు , గ్రేడ్ 2 లో  స్కిల్డ్ ఉద్యోగులు, గ్రేడ్ 3 లో  సెమీ స్కిల్డ్ ఉద్యోగులు, గ్రేడ్ 4 లో  అన్ స్కిల్డ్ ఉద్యోగులు ఉంటారు. వీరికి రూ.2,215 నుంచి రూ.2,500 వరకు వేతనాలు పెంచారు. పెంచిన జీతాన్ని జూలై 29 నుంచి చెల్లిస్తారు. పిఎఫ్, ఇఎస్ఐ వాటాధనం గతంలో మాదిరిగానే వేతనాల్లో భాగంగా ఉంటాయి. గ్రేడ్ 1 ఉద్యోగుల జీతాలు రూ. 20,785 నుంచి రూ.23,000లకు పెరిగాయి. గ్రేడ్ 2 ఉద్యోగుల జీతాలు రూ.16,663 నుంచి రూ.19,000లకు పెరగగా.. గ్రేడ్ 3 ఉద్యోగుల జీతాలు రూ.13,576 నుంచి రూ.16,000లకు పెరిగాయి. అటు గ్రేడ్ 4 ఉద్యోగుల జీతాలు రూ.11,500 నుంచి రూ.14,000 లకు పెరిగాయి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా ప్రతీ నెలా 1వ తేదీన బ్యాంకు అకౌంట్ లో జీతాలు జమ చేస్తారు. మరోవైపు నాలుగు సంస్థల్లో ఇప్పటి వరకున్న ఔట్ సోర్సింగ్ ఏజన్సీలన్నింటినీ రద్దు చేశారు. గతంలో మాదిరిగానే  విద్యుత్ సంస్థలు, ఆర్టిజన్ ఉద్యోగులు సంయుక్తంగా భవిష్యత్ నిధికి డబ్బులు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని వేతనాల్లోంచి తీసి ప్రాఫిడెంట్ ఫండ్‌కు జమచేస్తారు. ఇ.ఎస్.ఐ.కి చెల్లించే డబ్బులు కూడా సంస్థలు, ఉద్యోగులు సంయుక్తంగా చెల్లిస్తారు.

ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 25,540. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టిజన్స్ గా గుర్తించడ వల్ల మరో 2 3వేల మందికి పైగా సంస్థలో ఉద్యోగులైనట్లు లెక్క. అటు మరో 13 వేల మందిని నియమించడానికి కసరత్తు జరుగుతోంది. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థల సిబ్బంది సంఖ్య 62 వేలు దాటుతుంది. వీరు కాక 19వేల మంది పెన్షనర్లు కూడా విద్యుత్ సంస్థల్లో ఉన్నారు.