రికార్డుల్లో ఉన్నవారికే భూ యాజమాన్య హక్కు

భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో బినామీలకు చెక్ పెట్టనున్నది. బినామీల పేరుతో సీలింగ్ చట్టాల నుంచి తప్పించుకునే వారికి అడ్డుకట్టపడనుంది. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఎవరి పేరుతో పట్టా ఉంటే వారికే ఆ భూమిని అప్పగిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈవిధంగా బినామీల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అప్రకటితంగా రద్దుచేయనున్నది. బినామీలకు చెక్ పెట్టేందుకు కొత్త రికార్డుల ప్రకారంగా రూపొందించిన పహాణీలను గ్రామపంచాయతీ గోడలపై రాస్తారు. ఈవిధంగా ప్రతి ఊరికి గోడ పహాణీలు.. రానున్న సంవత్సరంలో ఉనికిలోకి రానున్నాయి. వరంగల్ జిల్లాలో అప్పటి కలెక్టర్ ప్రయోగాత్మకంగా చేపట్టిన గోడపహాణీ.. నేడు రాష్ట్ర వ్యాప్తం కానుంది.

గోడపహాణీల ద్వారా బినామీలు తమ వద్దే అంటిపెట్టుకున్న  రికార్డ్స్ బట్టబయలు కానున్నాయి. భూమి రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారుల బృందాలు..రికార్డుల్లో ఎవరిపేరుతో భూమి ఉందో వారి ఇంటికి రికార్డులు తీసుకొని..వారిపేరుతో ఇంత భూమి ఉన్నట్లు వారికి తెలియజేస్తారు. ఈమేరకు నోటీసులు కూడ ఇస్తారు. ఒక వేళ ఎవరైనా భూస్వాములు వచ్చి ఆభూమి తమదేనని చెప్తే వారిది ఎలా అవుతుందో రికార్డులతో నిరూపించాల్సి ఉంటుంది. లేనపక్షంలో ఆ భూమి ఎవరిపేరున ఉందో వారికే చట్టబద్ధమైన హక్కు లభిస్తుంది. ఈవిధంగా బినామీల భూములన్నింటికి రికార్డుల్లో ఉన్నపేదవారే..యజమానులవుతారు.ఈ విషయాన్ని పహాణీలో చేర్చి ఊరంతటికి తెలియజేస్తారు. ఇదంతా కూడ చట్టబద్దంగానే జరుగుతుంది. నల్లగొండ జిల్లా ములకలకాలువ గ్రామంలో చేపట్టిన విధంగానే రాష్ట్ర వ్యాప్తం చేయనున్నారు.

అటు రెవెన్యూలో భూయాజమాన్య హక్కులు కల్పించే కీలకమైన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టం ప్రకారమే భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం.గ్రామంలో రెవెన్యూ బృందాలు ఇంటింటికి భూమి రికార్డులతో వెళతాయి. ఈ బృందాలకు తహసిల్దార్, గిర్దావర్లు నాయకత్వం వహిస్తారు. ప్రక్షాళనలో మార్పులు, చేర్పులు అభ్యంతరాలు స్వీకరించి గ్రామపంచాయతీ వద్ద నోటీస్ అతికిస్తారు.దాని పూర్తి వివరాలు..దానిపై గల వంశంలోని వారందరికి నోటీసులు అందజేస్తారు. ఆ తరువాత సదరు భూమికి ఎంత మంది వారసులుంటే అంతమందికి పంచనామ నిర్వహించి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈమేరకు ఆర్వోఆర్ చట్టంలో ఆర్డీవో, తహసిల్దార్ కు పూర్తి అధికారాలు ఉంటాయి.

ఇక రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పకడ్బందిగా రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టనున్నారు.పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడ నిర్ధేశిత గడువులోగా రైతులకు అందజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.దీంతో పాటుగా భూముల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్ అయిన రోజే మ్యూటేషన్ చేయాలని నిర్ణయించారు.మ్యూటేషన్ తర్వాత అన్ని ప్రక్రియలు పూర్తి చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని నాలుగు రోజుల్లో కొరియర్ ద్వారా రైతు ఇంటికి పంపనున్నారు. ఒక వేళ పాస్ పుస్తకాలు పంపించడంలో ఆలస్యం ఐతే..సంబంధిత అధికారికి వెయ్యిరూపాయల అపరాధ రుసుము విధించాలని కూడ నిర్ణయించారు.

అటు పాస్ పుస్తకాలపై రిజిస్ట్రేషన్ అధికారి, రెవెన్యూ అధికారి మాత్రమే సంతకాలు చేసేలా అత్యంత భద్రతా ప్రమాణాలతో పట్టాదార్ పాస్‌ పుస్తకాలను రూపొందిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక ఇంకుతో కూడిన పెన్నును వాడాలని నిర్ణయించారు.ఇక పాస్ పుస్తకాన్ని చిరగకుండా..మరే పెన్ను పడని విధంగా ప్రత్యేకంగా రూపొందించనున్నారు.