రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే, రికార్డుల ప్రక్షాళన  

81 ఏండ్ల భూ రికార్డులకు పట్టిన బూజును రాష్ట్ర ప్రభుత్వం వదలగొడుతున్నది ఎన్నో ఏండ్లుగా భూ సమస్యలతో సతమత మవుతున్న రైతులకు  పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా గొల్లపల్లిలో భూరికార్డుల ప్రక్షాళనను మంత్రి పోచారం  ప్రారంభించారు. 90 రోజుల పాటు సాగనున్న భూరికార్డుల ప్రక్షాళనలో రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో భూ రికార్డుల ప్రక్షాళన మొదలైంది. మంత్రి ఈటెల రాజేందర్ సమగ్ర భూసర్వే ను ప్రారంభించారు. రైతుల భూవివాదాల పరిష్కారం కోసమే భూ సర్వేకు  శ్రీకారం చుట్టామన్నారు మంత్రి ఈటెల.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మద్దూర్ లో భూరికార్డుల ప్రక్షాళనను మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. రైతులకు వచ్చే ఏడాది నుంచి అందించే పంట పెట్టుబడి..నూతన భూ రెవెన్యూ రికార్డుల ద్వారానే ఇస్తామన్నారు.  అన్నదాతలు తమ భూ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

భూవివాదాల పరిష్కారం కోసమే  భూ రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామన్నారు మంత్రి జోగు రామన్న. 81 ఏళ్ల తర్వాత దేశంలో మొట్టమొదటి సారిగా సమగ్ర భూ సర్వే నిర్వహించిన ఘనత  తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా కొత్తూర్‌లో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు.

సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత యార్కారం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని  రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఆవశ్యకత గురించి గ్రామస్తులకు వివరించారు.

రైతుల బాగు కోసమే సీఎం కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని శివాయిపల్లిలో భూరికార్డుల ప్రక్షాళనను పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అన్నదాతలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సమగ్ర భూ సర్వే చారిత్రాత్మక కార్యక్రమమన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లి గ్రామంలో  భూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించారు. సమగ్ర భూ సర్వేలో అన్నదాతలు పాల్గొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ శ్వేతామహంతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా  తుర్కపల్లి మండలం నగాయిపల్లి, శ్రీనివాసపురం గ్రామాల్లో సమగ్ర భూ సర్వే  కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. భూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రైతుల భూ వివాదాలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతులంతా సర్వేలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

అత్యంత పారదర్శకంగా భూరికార్డుల ప్రక్షాళన ఉంటుందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు.భూరికార్డుల నవీకరణతో భూ అక్రమాలకు చెక్ పడుతుందని చెప్పారు.దుబ్బాక మండలం చర్వాపూర్ లో జరిగిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు అధికారుల బృందం, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమన్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌ కుమార్‌. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ సమితిలను ఏర్పాటు చేసి..అన్నదాతల భూ సమస్యలను తీరుస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రామాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ అన్నదాతల భూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రైతుల అభివృద్ధి టీఆర్ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌. అందుకోసమే భూ రికార్డుల ప్రక్షాళన చేస్తోందని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఎనుగల్లు గ్రామంలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి  హాజరయ్యారు. సమగ్ర భూ సర్వేలో రైతులంతా పాల్గొని తమ  సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ లో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి భూ సర్వే,రికార్డుల ప్రక్షాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  గ్రామంలోని సచివాలయంలో భూ రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో కలిసి పలువురి రైతుల భూ సమస్యలను పరిష్కరించారు.

కామారెడ్డి జిల్లా నసురుల్లబాద్‌ మండలం దుర్కి గ్రామంలో కలెక్టర్ సత్యనారాయణ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు రైతుల భూ సమస్యలను కలెక్టర్‌ దగ్గరుండి పరిష్కరించారు. సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు 90 రోజుల పాటు భూ సర్వే కొనసాగుతుందన్నారు. రైతులు తమ భూ వివాదాలను సరిచేసుకోవాలని సూచించారు.

నల్గొండ జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన మొదలైంది. భువనగిరి మండలం తాజ్‌పూర్‌, ఎర్రబెల్లి, పెంచికల్‌పహాడ్‌ గ్రామాల్లో  భూ సమగ్ర సర్వేను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ప్రారంభించారు..  డిసెంబర్‌ 15 వరకు సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అటు ఆలేరు లోను సమగ్ర భూ సర్వేను విప్ గొంగడి సునీత ప్రారంభించారు..

వికారాబాద్ జిల్లా మద్గుల్ చిటంపల్లిలో  భూమి రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమాన్ని  ఎమ్మెల్యే సంజీవరావు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులీతో కలిసి భూ రికార్డులను పరిశీలించారు. గ్రామంలో  నిరుపేద రైతులకు భూమి పట్టాలను  కలెక్టర్ దివ్యతో కలిసి ఎమ్మెల్యే సంజీవ రావు అందచేశారు.