రాష్ట్రానికి మరో 2 స్కోచ్ అవార్డులు

వివిధ రంగాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్  చేపట్టిన ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలను సాధిస్తున్నది. ప్రగతి, ప్రత్యేక కార్యక్రమాల అమలును పరిశీలించిన స్కోచ్  సంస్థ..  మున్సిపాలిటీలకు ఉత్తమ అవార్డులను ప్రకటించింది.  సిద్దిపేట స్పెషల్  గ్రేడ్  మున్సిపాలిటీ స్కోచ్  అవార్డును దక్కించుకుంది. సాలిడ్  వేస్ట్  మేనేజ్  మెంట్ , ఓడీఎఫ్, పరిసరాల పరిరక్షణ అంశాలపై సిద్దిపేటకు స్కోచ్  అవార్డు రావడం వరుసగా ఇది రెండోసారి. మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సిద్ధిపేట మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది. మంత్రి స్ఫూర్తితో పాలకవర్గం, అధికార యంత్రాంగం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నది. స్కోచ్  సంస్థ 2016 జూన్  20న ముంబై పట్టణంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. దీనికి దేశంలోని వివిధ రాష్ట్రాల మున్సిపాలిటీల నుంచి పలువురు పాల్గొని..వారి పురపాలికలో చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్ర నివేదికను సమర్పించారు.

సిద్దిపేట మున్సిపాలటీలో చేపడుతున్న సాలిడ్  వేస్ట్  మేనేజ్ మెంట్, ఓడీఎఫ్, పరిసరాల పరిరక్షణ అంశాలపై స్కోచ్  స్పందించింది. అమలుతీరు బాగుందని గుర్తించిన సంస్థ ప్రతినిధులైన జ్యూరి సభ్యులు సిద్దిపేట మున్సిపాలిటీని అవార్డుకు ఎంపిక చేశారు. సిద్ధిపేటలో సేకరించే వ్యర్థాల నిర్వహణ సమర్థంగా చేపట్టేందుకు గ్రీన్  రిసోర్స్ పార్కు ఏర్పాటుకు మంత్రి హరీష్ రావు అంగీకరించారు. ఇందులో ప్రతిరోజు దాదాపు  ఎనమిది మెట్రిక్  టన్నుల వ్యర్థాల నుంచి రెండు మెట్రిక్  టన్నుల వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నరు.  వీటిని స్వయం సహాయక బృందాలు, రైతులకు విక్రయించి ఆదాయం సమకూర్చుకునే అవకావాన్ని కల్పించారు. ఈ పార్కును నీతి ఆయోగ్  సభ్యులు కూడా సందర్శించారు. కేంద్రం రూపొందించిన ఘన వ్యర్థాల నిబంధనలు-2016ను అనుసరించి సిద్ధిపేట బృహత్  ప్రణాళికలను రచించింది. సమాజంలోని ప్రతి ఒక్కరిని ఈ లక్ష్యంలో భాగస్వాములను చేసింది. ప్రజాభిప్రాయాలను సేకరించింది.

మరోవైపు వరంగల్  నగరానికి మరోసారి అరుదైన అవార్డు దక్కింది. స్వచ్ఛ భారత్  ఆర్డర్  ఆఫ్  మెరిట్  అవార్డు ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణంతోపాటు పబ్లిక్ టాయిలెట్లు, షీ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మిస్తూనే మానవవ్యర్థాల శుద్ధీకరణ ప్రాజెక్టును చేపట్టడంతో ఈ అవార్డు లభించింది. మానవవ్యర్థాలను క్రమబద్ధంగా నిర్వహణ చేయడంపై కార్పొరేషన్ చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. దీన్ని 8, 9 తేదీల్లో ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్ సమ్మిట్‌లో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, కమిషనర్ శ్రుతి ఓఝా అందుకోనున్నారు. ఈ మేరకు స్కోచ్ సంస్థ ఆహ్వానంపంపింది. నగరానికి స్కోచ్ అవార్డు రావడం ఇది రెండోసారి. 2016 సంవత్సరంలో కార్పొరేషన్‌లో ఈ – ఆఫీస్ విధానం వందశాతం అమలుచేసినందుకు స్కోచ్ అవార్డు వచ్చింది. వరుసగా రెండుపర్యాయాలు అవార్డు దక్కించుకోవడంపై నగర మేయర్ నన్నపునేని నరేందర్ హర్షం వ్యక్తంచేశారు.

ప్రఖ్యాత స్కోచ్ సంస్థ ద్వారా ఈ ఏడాది అత్యుత్తమ ఐటీ మంత్రిగా ఎంపికయిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అభినందనలు వెల్లువెత్తాయి. మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్‌తోపాటు ఆయన అధికారిక ఖాతాకు ప్రజాప్రతినిధులు ఐటీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు తెలంగాణవాదులు ఇతర రాష్ర్టాలవారు సెలబ్రిటీలు శుభాభినందనలు తెలిపారు. ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ సృజనాత్మకంగా ఆలోచిస్తుండటమే కాకుండా స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్న మంత్రి ఈ అవార్డుకు పూర్తి అర్హులు అని ట్వీట్ చేశారు. గొప్ప అవార్డు దక్కిన సందర్భంగా మీకు మీ కుటుంబసభ్యులకు అభినందనలు అని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ అధికారి కాథరిన్ బీ హడ్డా ట్విట్టిర్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఉత్తమ ఐటీ మంత్రిగా అవార్డు పొందిన మీకు అభినందనలు సర్ అని ప్రముఖ సినీనటి సమంత ట్వీట్ చేశారు. టీహబ్ వంటి వినూత్న ఆవిష్కరణల కేంద్రాన్ని తీసుకురావడం ద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మీకంటే మరెవ్వరూ ఈ అవార్డుకు అర్హులు కారు అని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అభినందనలు తెలిపారు. వీరందరికీ పేరుపేరునా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.