రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలాన్ని తలపించేలా భానుడు నిప్పులు గక్కాడు. ఈ నేపథ్యంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి,,, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉతర కోస్త్రాంధ్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో.. జోరువానలు కురిసే అవకాశముందని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంతంపై.. ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దాదాపు 20 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్ లోకి చేరింది. అంతే క్యూసెక్కుల నీరును దిగువకు వదులుతున్నారు. అటు నారాయణపూర్ ప్రాజెక్ట్ లోకి 15 వేల 344 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 13 వేల 622 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. ఇక ఎస్సారెస్పీలోకి 1,718 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1073.5 అడుగుల నీటి నిల్వ ఉంది. ఇక కడెం జలశయానికి 685 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు 2410 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.

అటు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటిదాకా నిప్పులు కురిపించిన భానుడు మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. నగరమంతా మబ్బు కమ్ముకుంది. పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకొని డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. అటు నగరంలో పలు చోట్ల జోరువాన పడింది.

అటు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి.  వరంగల్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.  భీకర వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన జిడబ్ల్యూఎంసి అధికారులు  సహాయక చర్యలు చెపట్టారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం,భూదాన్ పోచంపల్లి లో ఎడతెరిపిలేకుండా వర్షం పడింది. దట్టమైన మబ్బులతో వాన పడటంతో చిమ్మచీకటి అలుముకుంది. సిగ్నల్స్కు అంతరాయం ఏర్పడటంతో మొబైల్ నెట్వర్క్స్ పనిచేయలేదు. భారీ వర్షంతో అధికారులు పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం పూర్తి గా స్థంబించింది.లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్రం అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో ఉరుముల ఉరుపులతో  కూడిన భారీ వర్షం పడింది.  ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణం లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహించాయి.  దీంతో పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఇటు ప్రభుత్వాసుపత్రి లోని  మెటర్నిటీ వార్డ్డులోకి వర్షపు నీరు చేరడంతో రోగులు  ఇబ్బందులకు గురయ్యారు. రాబోయే  3 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని చెబుతున్నారు.