రాష్ట్రంలో బహుళజాతి కంపెనీల ఏర్పాటుకు సుముఖత

తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు పలు బ‌హుళ జాతి సంస్థలు ముందుకొచ్చాయి. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్ట్ ఇండియా సమ్మిట్ లో ఈ మేరకు సుముఖత వ్యక్తం చేశాయి. మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఇన్వెస్ట్ ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ ప్రిన్సిప‌ల్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ అర‌వింద్ కుమార్ పాల్గొన్నారు.

ఐటీ, ప‌రిశ్రమ‌ల రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ అండ్ ఎండీ దీపక్ బాగ్లా, వైస్ ప్రసిడెంట్ దుష్యంత్ ఠాకూర్ లకు మంత్రి కేటీఆర్ వివ‌రించారు. టీ-హ‌బ్, టీఎస్-ఐపాస్ ల గురించి తైవాన్ ఇన్వెస్టర్ల బృందానికి అరవింద్ కుమార్ పేప‌ర్ ప్రజెంటేష‌న్ ఇచ్చారు.

అంతకుముందు మంత్రి కేటీఆర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజును క‌లిశారు. విమానయాన రంగంలో రాష్ట్రానికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు.