రాష్ట్రంలోని జలాశయాలకు జలకళ  

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షాలకుతోడు జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాలకు ఎగువ నుంచి 47 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో నాలుగు గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులిడుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్‌లతో పాటు మహారాష్ట్రలోని భీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజె క్టు నుంచి వరద భారీగా వస్తున్నది. ఈ నెల ఆరంభం నుంచి 20 వేల క్యూసెక్కులకు తగ్గకుండా ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. వరద ఉధృతి పెరిగి 56వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో మూడు స్పిల్‌వే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రెండు గేట్లు 1 మీటర్, 1 గేటు రెండు మీటర్లు ఎత్తి 14వేల 664 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జూరాల వద్ద విద్యుదుత్పత్తి యూనిట్లను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేసి 40వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. నీటి మట్టం నిలకడగా స్థిరంగా ఉండటంతో నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా 8వేల 320 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 6 వేల క్యూసెక్కుల నీటిని కాల్వలు, లిఫ్టులకు విడుదల చేస్తున్నారు.
ఆల్మట్టి ప్రాజెక్టుకు 25,314 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా పవర్‌హౌస్ ద్వారా 24,291 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 30,724 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 32255 ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టుకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో స్పిల్‌వే గేట్ల నుంచి 40,600 క్యూసెక్కులు.. పవర్‌హౌస్ నుంచి 1500 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద పెరుగుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పలు దఫాలుగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదులుతున్నారు. అటు భారీ వర్షాలతో మూసీనది నిండుకుండలా మారింది. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 643.8కు చేరింది. ఎగువ నుంచి 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజె క్టు నిండుకుండలా మారడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది.

మరోవైపు  విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అదిలాబాద్, నిర్మల్  జిల్లాల్లోని జలాశయాలకు భారీగా వరద నీరు వస్తోంది.రెండు జిల్లాల్లో ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువుల, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. నీటి గలగలలతో జలపాతాలు కనువిందు చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి 51 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 699.5 అడుగులు ఉంది. అదనంగా వచ్చే 61వేల 2వందల క్యూసెక్కుల నీటిని.. ఐదు వరద గేట్లు ఎత్తివేసి, గోదావరి నదిలోకి వదులుతున్నారు. అటు కుడి కాల్వ ద్వారా 19 క్యూసెక్కులు.. ప్రధాన కాల్వ ద్వారా 827 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 5వేల 450 క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 358.7మీటర్లు కాగా.. ప్రస్తుతం 357మీటర్లు ఉంది. అటు స్వర్ణ ప్రాజెక్టులోకి కూడా వరదనీరు భారీగా వస్తోంది. ఈ ప్రాజెక్టు నీటిమట్టం 1, 183మీటర్లు కాగా.. 1, 182మీటర్లు ఉంది. ఇన్‌ ఫ్లో మరింత పెరిగితే వరద గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని మత్తడివాగు సామర్థ్యం 277.5 మీటర్లు కాగా.. ప్రస్తుతం 276 మీటర్ల మేర నీరు ఉంది. ఎగువ నుంచి 823. 4 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది. అటు సాత్నాల ప్రాజెక్టులోకి పుష్కలంగా నీరు చేరింది. భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి 12వేల 340 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుత నీటిమట్టం 1075.7 అడుగులు ఉండగా.. 41.452 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. దీంతో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు 450 క్యూసెక్కులు, కాకతీయ కాల్వకు 50, లక్ష్మీ కాల్వకు 300, సరస్వతీ కాలువకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా 7, 966 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం వెయ్యి 712.93 అడుగులు కాగా.. 22.1 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.