రాజా సదారాం కు రాష్ట్ర ప్రభుత్వ సన్మానం

అసెంబ్లీ కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన రాజా సదారాం కు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అసెంబ్లీని వ్యూహాత్మకంగా నిర్వహించిన రాజా సదారాంపై నేతలంతా ప్రశంసలు కురిపించారు. రాజా సదారాం వీడ్కోలు సభలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

శాసనసభ, శాసన మండలి నిర్వహణలో రాజాసదారాం ఒక కొత్త ఒరవడిని సృష్టించారని స్పీకర్ మధుసూదనాచారి ప్రశంసించారు. సదారాం లేకుండా సభ నిర్వహించడం కాస్త ఆందోళనగానే ఉందని అన్నారు. రాజా సదారాం చూపిన బాటలో దేశానికే ఆదర్శంగా ఉభయ సభలు నిర్వహిస్తామని స్పీకర్ తోపాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతో వ్యూహాత్మకంగా శాసనసభను నిర్వహించిన ఘనత రాజా సదారాంకే దక్కుతుందని మంత్రి హరీశ్‌ రావు కొనియాడారు. ఆయన సేవలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ వినియోగించుకుంటుందని చెప్పారు. మంత్రులు నాయిని, ఈటెల కూడా రాజా సదారాం సేవలను ప్రశంసించారు.

రాజా సదారాం సేవలను ప్రతిపక్ష నాయకులు సైతం కొనియాడారు. అసెంబ్లీకి ఆయన అందించిన సేవలు మరచిపోలేమని సీఎల్పీ నేత జానా రెడ్డితో పాటు షబ్బీర్ అలీ, కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. దేశంలోనే తెలంగాణ శాసనసభ ఆదర్శవంతంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరుపుతుందని వారు అన్నారు.

అసెంబ్లీ కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రంలో రిటైరవడం తన అదృష్టమన్నారు రాజా సదారాం. అసెంబ్లీలో 41 ఏళ్లపాటు ఎంతో మంది ఉన్నత విలువలు గల వ్యక్తులతో పని చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని రాజా సదారాం చెప్పారు.

అసెంబ్లీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాజా సదారాం కృతజ్ఞతలు తెలిపారు. అటు నేతలు కూడా ఆయనను ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు.