రాజధానిలో ఎల్ఈడీ లైట్ల ధగధగలు

గ్రేటర్‌ హైదరాబాద్ రహదారులలో మసకబారిన వీధిదీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. విద్యుత్‌ బిల్లు, నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలని గతంలోనే జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ లైట్ల విషయంలో మంత్రి కేటీఆర్ చొర‌వ‌తో ప్రాజెక్టు ప‌నులు మ‌రింత వేగం అందుకున్నాయి. వచ్చే దీపావళి కల్లా రాజధాని నగరం మొత్తం ఎల్ఈడీ వెలుగులతో ధగధగలాడాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీంతో సిటీలో రోడ్లన్నీ తెల్లటి ఎల్ఈడీ లైట్లతో వెలిగిపోతున్నాయి. ప్రకాశ‌వంత‌మైన వెలుతురే కాకుండా విద్యుత్ బిల్లులు కూడా భారీగా ఆదా అవుతున్నాయి.

ఇంతకుముందు సిటీలో ఉన్న లైటింగ్ కు .. ప్రస్తుతం ఎల్ఈడీ వెలుగులకు తేడా స్పష్టంగా  కనిపిస్తోంది.  ఎస్వీ ల్యాంప్స్ ఎర్రగా కనిపిస్తే.. ఎల్ఈడీ లైట్లు మాత్రం ప్రకాశవంతమైన వెలుతురుతో ఆకట్టుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే మార్గంలో ఒకవైపు ఎస్‌వీ ల్యాంప్స్‌, మ‌రోవైపు ఎల్ఈడీ బ‌ల్బులను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలో తేడాను స్పష్టంగా గమనించవచ్చు.

జంటనగరాల్లో ప్రస్తుతం సోడియం వేపర్‌ (ఎస్వీ) వీధి దీపాలున్నాయి. ఎస్‌వీ ల్యాంప్స్‌కు విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వీటి నిర్వహణ కోసం ఏటా వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖర్చు అవుతోంది. అయితే, ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తే ఈ వ్యయాన్ని చాలా వరకు తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా రుజువైంది. 40 నుంచి 50 శాతం విద్యుత్‌ కూడా  పొదుపు అవుతుందని అధికారులు గుర్తించారు. విద్యుత్ ఆదానే కాకుండా వెలుతురు కూడా ఎక్కువ‌గా ఉండ‌డంతో న‌గ‌ర రోడ్ల ప‌రిస‌రాలు ప్రకాశ‌వంతంగా దర్శనమిస్తున్నాయి.