రచయితగా మారిన మైక్రోసాఫ్ట్ సీఈవో

అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీయుడు సత్య నాదెళ్ల రచయిత అవతారం ఎత్తా రు. వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోలో ఎదిగిన తీరుకు సంబంధించిన బయటకు వెల్లడించని సమాచారాన్ని బుక్‌ద్వారా బయటపెట్టారు. హిట్ రీఫ్రెష్ పేరుతో సహ-రచయిత గ్రేగ్ షా, జిల్ ట్రేసియా నికోల్స్‌లతో నాదెళ్ల రాసిన పుస్తకం ఈ నెల 26న అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్నది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఈ పుస్తకానికి ముందుమాట రాయడం విశేషం. డిజిటల్ వరల్డ్ ఉట్టిపడేలా టైటిల్‌ను రూపొందించినట్లు, అలాగే ఎఫ్5 కీ కూడా దీంట్లో పొందుపరిచారు. గడిచిన రెండేండ్లకాలంలో మైక్రోసాఫ్ట్‌లో జరిగిన విప్లవాత్మక మార్పుల తీరును దీంట్లో వ్యక్తం చేసినట్లు బ్లాగ్‌లో నాదెళ్ల  వెల్లడించారు. టెక్నాలజీ, ఆర్థిక రంగం, ఇప్పటి వరకు జరిగిన వ్యక్తిగత వివరాలను దీంట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఫిబ్రవరి 2014లో స్టీవ్ బామర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పలు కీలక విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలుస్తున్నది. ఈ పుస్తకం చాలా మందికి దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు.  21 ఏండ్లుగా డిజిటల్ రంగంలో వచ్చిన పెనుమార్పులతోపాటు వ్యక్తిగత విషయాలైన భార్య, కుమారుడిపై కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.