యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ దక్కేదెవరికి?

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌లో మూడో టైటిల్‌ ముచ్చట తీర్చుకునేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచాడు. కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్‌.. క్వార్టర్స్‌లో ఫెడెరర్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకొచ్చిన జువాన్‌ మార్టిన్‌ డెల్‌ పొట్రో జోరుకు చెక్‌ పెట్టాడు.  పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో నెంబర్‌వన్‌, టాప్‌సీడ్‌ నడాల్‌ 4-6, 6-0, 6-3, 6-2తో 24వ సీడ్‌ డెల్‌ పొట్రోను చిత్తుచేశాడు. రెండు గంటల 50 నిమిషాల పోరులో నాదల్‌ ఐదు ఏస్‌లు, 45 విన్నర్లు సాధించి.. 20 అనవసర తప్పిదాలు చేశాడు. పొట్రో ఏడు ఏస్‌లు 23 విన్నర్లు కొట్టి 40 అనవసర తప్పిదాలతో ప్రతికూల ఫలితం ఎదుర్కొన్నాడు. 2010, 13లో ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌ మొనగాడు కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది రఫాకిది మూడో ఫైనల్‌ కావడం విశేషం. ఇవాళ జరిగే తుదిపోరులో 32వ ర్యాంకర్‌ కెవిన్‌ ఆండర్సన్‌ను ఢీకొననున్నాడు. మరో సెమీస్‌లో ఆండర్సన్‌ 4-6, 7-5, 6-3, 6-4తో 12వ సీడ్‌ స్పెయిన్‌ ప్లేయర్‌ పాబ్లో కారెన్‌ బుస్టాపై విజయం సాధించాడు. కాగా, కెవిన్‌పై నడాల్‌కు 4-0తో మెరుగైన రికార్డు ఉంది.