మోడీ సర్కారుపై మళ్లీ విమర్శలు

ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశం మనదేనంటూ చెప్పేముందు దశాబ్దం పాటైనా భారత్‌ను గరిష్ఠ వృద్ధిబాటలో నడిపించాల్సిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ మోడీ సర్కారుకు పరోక్షంగా చురకలంటించారు. పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన..  సంప్రదాయాలు, చరిత్రపై భారత్ ప్రపంచానికి ఉపన్యాసాలివ్వొచ్చు.. కానీ వృద్ధి విషయంలో పదేండ్లపాటు 8-10 శాతం వృద్ధి సాధించాకే బోధించాలి అని అన్నారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో భారత్.. వృద్ధిపరంగా చైనా కంటే వెనుకంజలో ఉంది. అంతక్రితం పలు త్రైమాసికాలపాటు ప్రపంచంలో అత్యధిక వృద్ధిసాధిస్తున్న దేశంగా చైనా కంటే ముందు వరుసలో నిలిచింది. ఆ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ఓ ఇంటర్వ్యూలో భారత వృద్ధిరేటుపై స్పందిస్తూ.. అంధుల రాజ్యంలో ఒంటికన్ను వాడే రాజు అని అన్నారు. ఆ వ్యాఖ్యలపై రాజన్ ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాడని ఆరోపించిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి.. ఆయన్ని గవర్నర్ పదవి నుంచి తొలగించాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. స్వామి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన రాజన్.. వృద్ధిపై అతిఆశావాదం పనికిరాదని, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నదే తన వ్యాఖ్యల అర్థమన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ త్రైమాసికం నుంచి భారత వృద్ధిరేటు క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల్లో 6.1 శాతానికి పడిపోయిన జీడీపీ.. ఏప్రిల్ -జూన్ మధ్యకాలానికి 5.7 శాతానికి క్షీణించింది.