మోడీ నిర్ణయంపై శివసేన విమర్శలు

పెద్దనోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ఏం సాధించిందని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన శివసేన ప్రశ్నించింది. డిమానిటైజేషన్‌ తర్వాత ఆర్‌.బి.ఐ ప్రకటించిన గణాంకాల నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంపాదకీయం ప్రచురితమైంది. నిజంగా బ్లాక్‌ మనీ కలిగిన వారిపై నోట్ బందీ ఎలాంటి ఎఫెక్ట్  చూపలేకపోయిందని శివసేన అభిప్రాయపడింది. కొత్త నోట్ల ముద్రణ కోసం ఏకంగా 21 వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారని మండిపడింది. ప్రచారం కోసమే ఇలా చేశారని, సున్నితంగా పయనిస్తున్న భారత ఆర్థిక పురోగతిని నోట్ల రద్దు నిర్ణయం కుదేలు చేసిందని సామ్నాలో విమర్శించారు. ధరలు విపరీతంగా పెరిగాయని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని శివసేన అభిప్రాయపడింది. ఈ అంశంపై ఇప్పటి వరకు విపక్షాలే విమర్శలు గుప్పించగా… తాజాగా మిత్రపక్షమైన శివసేన సైతం ఆరోపణలు చేయటం మోడీ సర్కార్ కు ఇబ్బందిగా మారింది.