మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కృష్ణ నదీ బోర్డు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. హైదరాబాద్‌, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి రెండు టీఎంసీలు విడుదల చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం నెలరోజులకు పైగా కోరుతూనే ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం ఉన్నప్పటికీ బోర్డు ఆదేశాలు జారీ చేయలేదు. ఏపీ అంగీకరించదనే కారణంతో చేతులెత్తేసింది. మరోవైపు బోర్డును లెక్కచేయని ఏపీ ప్రభుత్వం … శ్రీశైలం ఫోర్‌ షోర్‌ నుంచి ముచ్చుమర్రి ద్వారా నీటిని తరలించుకుపోతూనే ఉంది.

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా కరెంటు ఉత్పత్తితో దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగా బోర్డుకు నాలుగు రోజుల కిందట స్పష్టం చేసింది. అయినా బోర్డు అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. దీంతో చేసేదిలేక.. సోమవారం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో తెలంగాణ జెన్‌కో పలు గంటలపాటు కరెంటు ఉత్పత్తి చేసింది.  ఈ సమాచారాన్ని అందుకున్న కృష్ణా బోర్డు.. ఎట్టకేలకు  నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌, నల్గొండ తాగునీటి అవసరాలకు తెలంగాణ కోరినట్లుగా శ్రీశైలం నుంచి సాగర్‌ కు రెండు టీఎంసీల నీటి విడుదలకు ఆదేశిస్తున్నట్లు తన లేఖలో పేర్కొంది.

ఈనెల 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం విద్యుతుత్పత్తి కేంద్రం ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తుంది. వాస్తవంగా శ్రీశైలం నుంచి రెండు టీఎంసీల నీటి విడుదలతో ఆవిరి, సరఫరా నష్టాలు పోను సుమారు ఒకటిన్నర టీఎంసీలు దాదాపు రెండు రోజులకు నాగార్జున సాగర్‌ చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. బోర్డు ఆదేశాలనైతే జారీ చేసింది కానీ, ఏపీ వైపు నుంచి కరెంటు ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటుందా? అనేది అనుమానమే.