ముగిసిన గౌరి అంత్యక్రియలు

ప్రముఖ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బెంగళూరు చామరాజ్‌ పేటలోని లింగాయత్ రుద్రభూమి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు అధికార, అనధికార ప్రముఖులు, పెద్దసంఖ్యలో జర్నలిస్టులు గౌరి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి తుది వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు హాజరైన గౌరి అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు.

అంతకుముందు ప్రజల సందర్శన కోసం గౌరి భౌతికకాయాన్ని రవీంద్ర కళాక్షేత్రంలో ఉంచారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు, గౌరి అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పించారు.

గౌరి లంకేష్ ని నిన్న గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంటి దగ్గరే తుపాకితో కాల్చి దారుణంగా హత్య చేశారు.