మా నట ప్రయాణం స్వల్పకాలమే!

‘కృష్ణాష్టమి’, ‘మలుపు’, ‘మరకతమణి’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన భామ నిక్కీ గల్రానీ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాయిక సంజన సోదరిగానూ గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం దక్షిణాది నాయికల్లో నిక్కీ గల్రానీకి ఓ ప్రత్యేకత ఉంది. 2014లో ఈ సుందరి తెరంగేట్రం చేసింది. కేవలం మూడేళ్లలోనే పాతిక చిత్రాల్లో నటించింది. మూడేళ్లలో ఇరవై అయిదు సినిమాల్లో నటించడమంటే అంత సులువు కాదు. స్టార్‌ హీరోలైతే ఈ ఫీట్‌ సాధించేందుకు కనీసం పదిహేనేళ్ల సమయం పడుతోంది. ఇంత త్వరగా ఎలా సినిమాలు చేయగలిగారు అని అడిగితే…నిక్కీ సమాధానమిచ్చింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ…’నాయికల కెరీర్‌ ఎంత కాలం ఉంటుందో తెలుసు. మా నట ప్రయాణం స్పల్పకాలమే. కొత్త నాయికలు రాగానే పక్కన పెట్టేస్తారు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్నీ చేసుకుంటూ వచ్చాను. అయితే ఇందులో కథా కథనాలకు, నా పాత్రకూ ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నాను. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా విరామం తీసుకోలేదు. వీలు దొరికినప్పుడు ఆ సమయాన్ని కుటుంబంతో, స్నేహితులతో గడుపుతుంటాను. పని ఒత్తిడిలో వాళ్లను మర్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను. వృత్తిని, వ్యక్తిగతాన్ని సమతూకం చేయడం తీరిక లేని నాయికలకు కష్టమే. కళాశాల చదువులు పూర్తయ్యేవరకు భవిష్యత్‌లో ఏం చేయాలో స్పష్టత ఉండేది కాదు. కెరీర్‌ గురించి ముందస్తు ప్రణాళిక వేసుకోలేదు. ఒక్కసారి సినిమా అవకాశాలు వచ్చాక..ఇక ఇదే నా వృత్తి అని నిర్ణయించుకున్నాను. నాది కష్టపడేతత్వం. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించగలగటం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. ఇంకొన్ని స్క్రిప్టులు వింటున్నాను. ఎన్ని సినిమాలు చేయగలిగితే అన్ని త్వరత్వరగా చేసేయాలి.’ అని చెప్పింది.