మార్కెట్లోకి నిస్సాన్‌ ఎలక్ర్టిక్‌ కారు

టెస్లా కంపెనీ నుంచి పోటీ మరింతగా పెరిగిన నేపథ్యంలో సరికొత్త ఫీచర్లతో కూడిన లీఫ్‌ ఎలక్ర్టిక్‌ కారును నిస్సాన్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 2 నుంచి జపాన్‌లో, జనవరి నుంచి కెనడా, అమెరికాలో ఈ కారును విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని, ఇంతకు ముందు తెచ్చిన లీఫ్‌ మోడల్‌కన్నా దీని సామర్థ్యం 40 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. ఈ కారు ఎలక్ర్టిక్‌ కార్ల మార్కెట్లో సరికొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఈ కార్లులో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌, సరికొత్త డిజైన్‌ ఉన్నట్టు వెల్లడించింది. నిస్సాన్‌, ఇన్ఫినిటీ, డట్సన్‌ బ్రాండ్ల కింద అంతర్జాతీయంగా 60కి పైగా మోడళ్లను విక్రయిస్తున్నట్టు తెలిపింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 56.3 లక్షల కార్లను విక్రయించినట్టు పేర్కొంది. 2010 సంవత్సరంలో లీఫ్‌ ఎలక్ర్టిక్‌ కారును మొదటిసారిగా నిస్సాన్‌ విడుదల చేసింది.