మమ్మల్ని సవాల్‌ చెయ్యొద్దు!  

నార్త్ కొరియాను కంట్రోల్ చేయాలని భావిస్తున్న ప్రపంచ దేశాలను కిమ్‌ జాంగ్‌ లెక్కచేయటం లేదు. ఐక్యరాజ్యసమితి కఠిన అంక్షలు విధించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గటం లేదు. జపాన్‌ మీదుగా 3 వేల 7 వందల కిలోమీటర్లక దూరం పాటు ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం కావటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. సైన్యాధికారులతో ఎంతో ఉత్సాహంగా గడిపిన ఆయన…క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫోటోను విడుదల చేశారు. ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ కె.సి.ఎన్‌.ఎ కి ఈ ఫోటోను అందించారు. తాము ప్రయోగించిన క్షిపణి పేరు వాసాంగ్-12 అని చెప్పారు. ఇదే మోడల్ క్షిపణిని ఆగస్టు 29న కూడా ప్రయోగించామని కిమ్ స్పష్టం చేశారు.

ఎప్పుడూ తమ అంతుచూస్తామని బెదిరించే అమెరికా సవాల్ విసిరేందుకే తాము ఈ ప్రయోగం చేశామని కిమ్ చెప్పారు. అమెరికాతో పాటు మా సైనిక సామర్థ్యం సమానంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తాను ఎందుకు అణు పరీక్షలు చేయాల్సి వస్తుందో అనే అంశంపై కూడా వివరణ ఇచ్చారు. ఉత్తర కొరియా అంతిమ లక్ష్యం అమెరికాతో సమానంగా సైనిక సంపత్తిని సాధించటమేనన్నారు. మమ్మల్ని హెచ్చరించే ధైర్యం అమెరికా చేయకుండా చేస్తామన్నారు కిమ్ జాంగ్‌.

అటు తమ భూభాగంపై క్షిపణి ప్రయోగం చేయటంపై జపాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కిమ్ జాంగ్ తిక్క చేష్టలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జపాన్‌ ప్రధాని షింజో అబే హెచ్చరించారు. చైనా మాత్రం చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.