మంత్రి కేటీఆర్ కు ప్రధాని అభినందన లేఖ

ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు అందించే మిషన్ భగీరథ మరోసారి ప్రధాని దృష్టిని ఆకర్షించింది. జల వనరులను ఒడిసిపట్టి జనం దాహార్తి తీర్చే ఈ పథకం.. అద్భుతమని ప్రధాని మోడీ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో మిషన్ భగీరథ కూడా అంతర్భాగమేనని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛత హి సేవ ఉద్యమంలో పాల్గొనాలని మంత్రి కేటీఆర్‌ కు ప్రధాని మోడీ లేఖ రాశారు.

ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ ఒక గొప్ప కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ కు రాసిన లేఖలో ప్రధాని మోడి కొనియాడారు. నదులు, సరస్సులతోపాటు ఇతరత్రా నీటి వనరులే మనకు జీవనాధారమని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

త్వరలోనే గాంధీ జయంతి జరుపుకోబోతున్న శుభ సందర్భంలో స్వచ్ఛత హి సేవ అన్న నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు. స్వచ్ఛత హి సేవ ఉద్యమంలో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ను ప్రధాని సాదరంగా ఆహ్వానించారు. మీరు ఈ ఉద్యమంలో పాల్గొంటే, ఎంతో మంది స్ఫూర్తి పొందుతారని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ మొబైల్ యాప్ ద్వారా మీ అనుభవాలను నాతో  షేర్ చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్‌ ను లేఖలో కోరారు ప్రధాని.

మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని అభినందించారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రధాని రాసిన లేఖను కేటీఆర్ పోస్ట్ చేశారు.