మంత్రి కేటీఆర్‌కు స్కోచ్‌ అవార్డు

మంత్రి కేటీఆర్‌ కు మరో అరుదైన గౌరవం దక్కింది. వరుసగా రెండో ఏడాది కూడా మంత్రి కేటీఆర్‌.. స్కోచ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్‌ ఆఫ్ ది ఇయర్‌గా స్కోచ్ అవార్డు ప్రదానం చేయనుంది. ఈనెల 9న ఢిల్లీలో స్కోచ్‌ 49వ సదస్సు జరగనుంది. అదే రోజు మంత్రి కేటీఆర్‌ ఈ అవార్డు అందుకోనున్నారు. గతేడాది కూడా మంత్రి కేటీఆర్‌ స్కోచ్‌ ఛాలెంజర్‌ అవార్డు అందుకున్నారు. ఇప్పటికే ఆధునిక సమాచార సాంకేతికతను సమర్థంగా వాడుకుంటూ ప్రభుత్వ సేవలను వినూత్నంగా అందిస్తున్నందుకు గాను తెలంగాణకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్‌ చేసిన కృషిని స్కోచ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ అభినందించారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమీర్‌ చెప్పారు. ఐటీరంగంలో కొత్త పాలసీల అమలులో కేటీఆర్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని ఆయన కొనియాడారు.

అవార్డుల ఎంపిక కోసం స్కోచ్ జ్యూరీ.. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2003 నుంచి స్కోచ్ సంస్థ పలు విభాగాల్లో అవార్డులు అందిస్తోంది. సంస్థకు చెందిన ప్రతినిధులు దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరును నిశితంగా పరిశీలిస్తారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పనితీరుపై స్కోచ్ సంస్థ సమగ్ర వివరాలు సేకరించింది. గతంలో అవార్డులు అందుకున్నవారితో పాటు ఐటీ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది. అటు రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను స్టడీ చేసింది. ప్రతీ ఏడాది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 18 వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2016లో అనూహ్యంగా దేశంలోనే బెస్ట్ పెర్ఫార్మర్ గా అవతరించింది. దీనికోసం ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను స్కోచ్ గ్రూప్ స్టడీ చేసింది. ఈ మేరకు 2017 కు గాను బెస్ట్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా మంత్రి కేటీఆర్ ను ఎంపిక చేసింది.

అటు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల ప్రశంసలు అందుకున్న టీఎస్‌ఐపాస్‌పాలసీ.. స్కోచ్ స్మార్ట్ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైంది. నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లోనే అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడంతో టీఎస్‌ఐపాస్‌కు దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగనవసరం లేకుండా కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా రెండేండ్లలో 4 వేలకు పైగా కంపెనీలకు అనుమతులు మంజూరు చేశారు.