భ్రమల నుంచి కాంగ్రెస్ బయటపడాలి

కాంగ్రెస్ నాయకులు భ్రమల్లో బతకడం మానేసి వాస్తవంలోకి రావాలని ఎంపీ బాల్క సుమన్ సూచించారు. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోయిందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు సీట్లు కూడా రావన్నారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతు సమన్వయ సమితులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, కరెంట్, నీళ్లు సమృద్ధిగా ఇస్తున్నామని ఆయన చెప్పారు. 17 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం ప్రపంచంలోనే తెలంగాణ ఒక్కటేనని అన్నారు.

దళితులపై అనేకచోట్ల దాడులకు ప్రత్యక్ష కారణం, సాక్ష్యం కాంగ్రెస్ పార్టీయేనని.. అలాంటి పార్టీ తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ సుమన్ మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో తొలిసారి రిజర్వేషన్ అమలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు.

రైతు సమన్వయ సమితిల ఏర్పాటుతో పల్లెల్లో పండగ వాతావారణం నెలకొందని ఎమ్మెల్సీ భానుప్రసాద్ చెప్పారు. ఇదంతా చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. రైతు సమన్వయ సమితులను అడ్డుకుంటే.. రైతులు తెలంగాణ పొలిమేరల దాకా కాంగ్రెస్ నేతలను తరిమికొడతారని హెచ్చరించారు.