భూరికార్డుల ప్రక్షాళన షురూ

దాదాపు ఎనిమిది దశాబ్దాల తరువాత భూమి సంబంధ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మహాయజ్ఞం మొదలైంది. డబుల్ ఖాతాలు, నిల్ ఖాతాలు, డెత్ ఖాతాలు లేకుండా, రెవెన్యూ పరమైన సమస్యలన్నింటినుంచీ రైతుకు విముక్తి కలిగించేలా, వాస్తవ హక్కుదారుకు యాజమాన్య హక్కులు లభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని రెవెన్యూ బృందాలు అనుకున్న సమయానికి చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన 1394 రెవెన్యూ బృందాలు 1389 గ్రామాల్లో భూ యాజమాన్య హక్కులు తెలియజేసే 1 బీ  రికార్డుల నకలు పత్రాలను పంపిణీ చేశాయి.

భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కోసం సీసీఎల్‌ఏలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌కు 040-23201347 ఫోన్ నంబర్ ఇచ్చారు. రైతులు తమ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, రెవెన్యూ బృందాలు సరిగ్గా స్పందించకుంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ప్రతి రైతుకు తన భూమి రికార్డులో ఎంత ఉన్నది? రికార్డుల్లోకి ఎక్కించాల్సినది ఎంత ఉన్నది? తదితర వివరాలన్నీ తెలియజేస్తారు. ఆ తరువాత వారికి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా రికార్డులు రూపొందించి గ్రామ రైతుల ఆమోదంతో ఎవరి పట్టాలు వారికి అందజేస్తారు. ఇందుకోసం పక్కా రికార్డును రూపొందించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని సరిగ్గా వంద రోజుల్లో పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న 10,744గ్రామాల్లో రికార్డులన్నీ క్లీన్ కానున్నాయి. ఇప్పటికే ములకల కాల్వ గ్రామాన్ని సమస్యలు లేని రెవెన్యూ గ్రామంగా అధికారులు పైలట్ ప్రాజెక్టుగా చేసి ప్రకటించారు. అధికారులకు రైతులు కూడా అండగా నిలబడటంతో అధికారుల పని మరింత తేలిక కానుంది.

మరికొందరు రైతులు భూము లు అమ్ముకున్న తరువాత కూడా ఆ ఖాతాలు అలాగే ఉంటాయి, ఈ ఖాతాలను ఆపరేట్ చేయడానికి భూమి కూడా ఉండదు. ఇలాంటి ఖాతాలను తొలగిస్తారు. అలాగే చనిపోయిన వారి పేరున ఉన్న ఖాతాలోని భూములను వారి వారసులకు ఫౌతి కింద కేటాయించి వాటిని తొలిగిస్తారు. వీటన్నింటి తొలిగింపులు ,కొత్త మార్పుల తరువాత గ్రామ భూమి సమగ్ర స్వరూపాన్ని రూపొందిస్త్తారు. గ్రామానికి చెందిన భూముల వివరాలన్నీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడపై కానీ, గ్రామ పంచాయతీ గోడపై కానీ రాస్తారు. అన్ని భూముల వివరాలు గ్రామంలోని ప్రజలందరూ చూసుకునే విధంగా గోడ పహాణీ ఏర్పాటు చేస్తారు. రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తరువాత 18 రకాల భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు రైతులకు అందజేస్తారు. దీనికి సంబంధంచిన నమూనాను కూడా సీఎం కేసీఆర్ ఆమోదించినట్లు సమాచారం.

అలాగే ఎక్కడా ట్యాంపరింగ్ చేయడానికి ఆస్కారం లేకుండా రూపొందించిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను రైతులకు అందజేస్తారు. గ్రామాల వారీగా అధికారులు తమ శాఖల పరిధిలోని భూముల వివరాలను రెవెన్యూ రికార్డులలో చేర్పించాలని, ఈ మేరకు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన…..గ్రామాల వారీగా తమ శాఖల ఆధీనంలో ఉన్న భూముల వివరాలు రూపొందించేలా జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రతి శాఖ ఆస్తుల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉండాలన్నారు.