భారీ వర్షాలతో ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరుకలెత్తుతున్నది. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండడంతో నీటిని దిగువకు వదులుతున్నరు.  ఆల్మట్టిలోకి 52 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణ పూర్  ప్రాజెక్ట్ లోకి 40వేల క్యూసెక్కుల ఇన్  ఫ్లో కొనసాగుతున్నది. 21వేల క్యూసెక్కుల నీటని కిందకు వదులుతున్నరు.  ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 12వేల 345 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్  ఫ్లో  పెరిగే అవకాశం ఉన్నదని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులోకి 21 వేలక్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. ఔట్ ఫ్లో 1875 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు14వేల 461 క్యూసెక్కుల ఇన్  ఫ్లో కొనసాగుతుంది. నాగర్జున సాగర్ లోకి 897 క్యూసెక్కుల ఇన్  ఫ్లో,, అవుట్  ప్లో కొనసాగుతుంది.

మహారాష్ట్రలోని భీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి 70 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో వస్తున్నది. గురువారం సాయంత్రం వరకు కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 52వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. అల్మట్టి నుంచి 40వేల క్యూసెక్కులను నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండటంతో గురువారం మధ్యాహ్నం నుంచి పవర్‌హౌస్ ద్వారా 6వేల క్యూసెక్కులు, నాలుగు స్పిల్‌వే గేట్లను ఎత్తి మరో 15వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శుక్రవారం వరకు మరింత పెరిగే అవకాశమున్నట్టు అధికారులు చెప్పారు. నారాయణపూర్, ఉజ్జయిని నుంచి విడుదల చేసిన వరద నీరు దాదాపు లక్ష క్యూసెక్కులు ..శనివారం వరకు జూరాలకు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రవాహం 20 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 85 నుంచి 100 టీఎంసీలు శ్రీశైలం డ్యాంకు చేరే అవకాశం ఉన్నది.

కృష్ణా నదికి వస్తున్న వరదతో జెన్‌కో అధికారులు గురువారం సాయంత్రం రెండు హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ఒక్కో యూనిట్ ద్వారా దాదాపు 7000 క్యూసెక్కులను థర్మల్ విద్యుత్‌కు వినియోగిస్తున్నారు. ఒక్క యూనిట్‌తో అప్పర్ జూరాలలో 39 మెగావాట్లు, లోయర్ జూరాలలో 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.

జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గురువారం రాత్రి వరకు 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు స్టేజ్-1, స్టేజ్-2 మోటర్లను గురువారం ప్రారంభించారు. దీంతో ఆయా రిజర్వాయర్లు, చెరువులకు నీళ్లు మళ్లిస్తున్నారు. ప్రస్తుతం నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమా-1కు 1300, కోయిల్‌సాగర్‌కు 315, కుడికాల్వకు 550, ఎడమ కాల్వకు 1030, సమాంతర కాల్వకు 1400 చొప్పున మొత్తం 5345 క్యూసెక్కులను వదులుతున్నారు. 7 వేల క్యూసెక్కులను విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి దిగువకు వదులుతున్నారు. భీమా-2కు 750 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు.

తుంగభద్ర డ్యామ్‌కు వరద కొనసాగుతున్నది. గురువారం సాయంత్రం వరకు 21వేల క్యూసెక్కులు నమోదవుతున్నది. ప్రాజెక్టులో 65.28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్రకు కూడా ఈ రెండు రోజుల్లో మరింత వరద పెరిగే అవకాశాలున్నాయి. అటు గోదావరి, మంజీరపై నిర్మించిన ప్రాజెక్టులు కూడ జలకళను సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి 6432 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వచ్చి చేరుతున్నది. సింగూరులోకి 3212 క్యూసెక్లు ఇన్  ఫ్లో కొనసాగుతుంది. నిజాంసాగర్ కు 1875, ఎల్లంపల్లికి 6551క్యూసెక్కుల ఇన్   ఫ్లో కొనసాగతుంది.