భారీగా తగ్గిన బంగారం ధరలు

ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్న పసిడి ధరలు మరుసటి రోజే భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ బలహీనంగా ఉండటం, దేశీయంగా ఆభరణాల కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో ధర భారీగా తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల రేటు రూ.820 తగ్గి రూ.30,530కి చేరింది. ఒక్కరోజులో ధర ఇంతటి స్థాయిలో పతనం కావడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. బంగారంతోపాటు వెండి వెలుగులు తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి ధర రూ.42 వేల దిగువకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో ట్రెండ్ బలహీనంగా ఉండటంతోపాటు దేశీయంగా ఆభరణాల కొనుగోలుదారులు, రిటైలర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి జారుకున్నట్లు బులియన్ ట్రేడర్ వెల్లడించారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఏడాది గరిష్ఠ స్థాయి 1,357.64 డాలర్లకు చేరుకున్న ఔన్స్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి 1,346 డాలర్లకు పరిమితమైంది. అలాగే వెండి ధర 17.93 డాలర్లకు తగ్గింది. ఉత్తర కొరియా-అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో శుక్రవారం బంగారం ధర రూ.990 పెరిగి పది నెలల గరిష్ఠ స్థాయి రూ.31,350కి చేరుకున్నది.