భారత్ కు మయన్మార్ అత్యంత సన్నిహిత దేశం

భారత్‌ కు అత్యంత సన్నిహిత దేశం మయన్మార్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. సరిహద్దు రక్షణ విషయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇందుకోసం మయన్మార్ లో తన పర్యటన మరింత సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. మయన్మార్ లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని… మయన్మార్‌ తో ఉన్న అనుబంధాన్నిగుర్తుచేసుకున్నారు. భారత్‌ కు అత్యంత సన్నిహిత దేశాల్లో మయన్మార్ ఒకటని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. మయన్మార్ లో మరో రెండు బిజినెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రధాని గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి సూచికగా భారత జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 40 మంది మయన్మార్ దేశస్థులను విడుదల చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.

ఆ తర్వాత బగాన్‌ లోని ప్రఖ్యాత ఆనంద ఆలయాన్ని ప్రధాని మోడి సందర్శించారు. అక్కడి విశేషాలను మయన్మార్ అధికారులు ప్రధానికి వివరించారు. టెంపుల్‌ అంతా కలియ తిరిగి… అక్కడి చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సందర్శకుల బుక్‌ లో సంతకం చేశారు.

అక్కడి నుంచి నేరుగా యాంగాన్ చేరుకున్న ప్రధాని మోడి, మయన్మార్ లోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో మయన్మార్ పాత్ర మరవలేనిదని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందేందుకు మయన్మార్‌ లోని భారతీయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చైనాలో బ్రిక్స్ సమావేశాల అనంతరం మయన్మార్ వెళ్లిన ప్రధాని, రెండు రోజులు ఆ దేశంలో పర్యటించారు. ప్రధానితో పాటు భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్‌ సహా పలువురు అధికారులు పర్యటనలో పాల్గొన్నారు.