భారత్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ చాలా కీలకమైన దేశమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతంలో పటిష్టమైన భద్రత కలిగిన దేశంగా భారత్‌ను తయారు చేయాలనే ఆలోచనతో ట్రంప్ సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. ఎఫ్-16, ఎఫ్-18 యుద్ధవిమానాలతోపాటు బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్‌ విమానాలను భారత్‌కు అమ్మాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ సర్కార్ ప్రతిపాదింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడుతాయని ట్రంప్ సర్కార్ ఆశిస్తోంది. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాలకు రక్షణ రంగం వెన్నుముకలాంటిదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ను బలోపేతం చేయాలని ప్రతిపాదనలో కోరారు. భారత్‌కు ఈ విమానాల అమ్మే ప్రతిపాదనకు ట్రంప్ ప్రభుత్వం మద్ధతుతెలుపుతోందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం చాలా కీలకమైనదని, ఈ ప్రాంతం వ్యాపార వాణిజ్యానికి చాలా కీలకమని సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలైస్ వెల్స్ తెలిపారు. అనేక వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నాయని, 2/3 వంతుల ఆయిల్ సరఫరా ఈ ప్రాంతం గుండానే జరుగుతుందన్నారు. కావున ఈ ప్రాంతంలో భారత్‌ను బలోపేతం చేయాల్సి ఉందని ఆమె అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌నల్ సబ్‌కమిటీకి రాతపూర్వకంగా ఆమె తెలియజేశారు.