బ్లాక్ మనీ ఎంత తగ్గిందో తెలియదు!

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎంతమేర నల్లధనం అంతరించిపోయిందన్న విషయంపై సమాచారం లేదని పార్లమెంటరీ కమిటీకి రిజర్వుబ్యాంక్ తెలిపింది. అలాగే, రద్దయిన నోట్ల మార్పిడి ప్రక్రియలోభాగంగా ఎంతమేర బ్లాక్ మనీ వైట్ గా మారిందన్న విషయమూ తమకు తెలియదని స్పష్టం చేసింది. అంతేకాదు, భవిష్యత్‌లో మళ్లీ డిమానిటైజేషన్ (నోట్ల రద్దు) ప్రక్రియను చేపడుతారా అన్న విషయంలోనూ తమకెలాంటి సమాచారం లేదని పార్లమెంటరీ కమిటీకి లిఖితపూర్వకంగా తెలిపింది. జూన్ 30నాటికి అందిన సమాచారం ప్రకారం మొత్తం 15.28 లక్షల కోట్ల రైద్దెన నోట్లు తిరిగి వచ్చాయని, ధ్రువీకరణ ప్రక్రియ ఆధారంగా భవిష్యత్‌లో ఈ అంకెను మళ్లీ సవరించే అవకాశం ఉందని ఆర్బీఐ వెల్లడించింది. తిరిగి వచ్చిన నోట్ల ప్రామాణికత, సంఖ్యాపరంగా కచ్చితత్వంపై ధ్రువీకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని తెలిపింది. రైద్దెన నోట్లు లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నందున ప్రక్రియ ముగిసేందుకు మరింత సమయం పడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ధ్రువీకరణ ప్రక్రియ జోరుగా సాగుతున్నదని, ఆర్బీఐ కార్యాలయాలు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయని, అత్యంత ఆధునిక మెషీన్ల సాయంతో నోట్లను ధ్రువీకరిస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీకి నియంత్రణ మండలి తెలిపింది.