బీహార్ లో జర్నలిస్టుపై కాల్పులు

బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య నెత్తుటి మరకలు ఆరకముందే బీహార్‌ లో మరో జర్నలిస్ట్ పై దాడి జరిగింది. అరవల్‌ పట్టణంలో జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంకజ్ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ‘రాష్ట్రీయ సహారా’ అనే హిందీ దినపత్రికలో ఆయన పని చేస్తున్నారు. బ్యాంక్‌ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసుకుని ఇంటికి వెళుతుండగా మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు  మిశ్రాపై కాల్పులు జరిపారు. ఆయన దగ్గరున్న నగదు దోచుకెళ్లినట్లు అరవల్‌ ఎస్పీ దిలీప్‌ కుమార్‌ తెలిపారు. కాల్పులు జరిపినవారిలో ఒకరిని అరెస్ట్‌ చేశారు.