బీసీసీఐ పెద్దలను మేనేజ్ చేయలేకపోయా!

భారత జట్టు చీఫ్ కోచ్ పదవికి తాను ఎందుకు ఎంపిక కాలేదో వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. బీసీసీఐలో కీలక నిర్ణయాలు తీసుకునే పెద్దలను తాను మేనేజ్ చేయలేకపోయానన్నాడు. భవిష్యత్‌లో మరోసారి కోచ్ పదవికి దరఖాస్తు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. బోర్డుతో నాకు సరైన సెట్టింగ్ లేదు. కోచ్‌ను ఎంపిక చేసే పెద్దలతో మంచి సంబంధాలు నెరపలేకపోయా. ఓవరాల్‌గా అందర్ని మేనేజ్ చేయడంలో నేను వెనుకబడిపోయా. కోచ్ పదవికి దరఖాస్తు చేసే విషయంలో బీసీసీఐలోని ఓ వర్గం నన్ను తప్పుదోవ పట్టించింది. కోచ్ కావాలని నేను కోరుకోలేదు. వాళ్లే ఆఫర్ ఇచ్చారు. బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదురి, జీఎమ్ శ్రీధర్ వచ్చి ఆఫర్ గురించి ఆలోచించమని చెప్పారు. కాస్త సమయం తీసుకొని దరఖాస్తు చేశా. ఈ విషయాన్ని కోహ్లీతో కూడా చర్చించా. అతను సరేనన్నాడు. కోచ్ పదవికి దరఖాస్తు ఎందుకు చేయలేదు? అని చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రవిశాస్త్రిని అడిగా. గతంలో చేసిన తప్పు మరోసారి చేయనని అతను అన్నాడు. శాస్త్రి ఉద్దేశం తెలిసిపోయింది కాబట్టి మనకు ఇబ్బంది లేదని అనుకున్నా. ఒకవేళ రవి బరిలో ఉంటే నేను దరిదాపుల్లోకి కూడా రాకపోయేవాణ్ని. మళ్లీ కోచ్ పదవి దగ్గరకు కూడా వెళ్లను అని సెహ్వాగ్ తెలిపాడు.