బీసీల జీవితాల్లో నిజమైన వెలుగు రావాలి

ఓటు బ్యాంకు రాజకీయం కాకుండా… మభ్య పెట్టే పథకాలు లేకుండా…  వెనుకబడిన తరగతులకు చెందిన కులాల వారి జీవితాల్లో నిజమైన వెలుగు రావడం కోసం ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బీసీ కులాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా కొన్ని బీసీ కులాలకు చెందిన వారి అభ్యున్నతి కోసం పలు పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అదే విధంగా అందరు బీసీలకు వారి వారి కుల వృత్తుల ప్రాతిపదికన చేయూత అందించే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కుల వృత్తులు లేని వారికి, కుల వృత్తులు మానేసి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నవారికి తగిన ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమాల కోసం బ్యాంకులతో లింకు లేకుండానే ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కులాల వారీగా ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. వివిధ వృత్తి కులాల ప్రతినిధులతో కొద్ది రోజుల్లోనే తాను కూడా సమావేశాలు నిర్వహించి, ఆయా వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టతకు రానున్నట్లు వెల్లడించారు. అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వెయ్యి కోట్ల నిధులు కేటాయించామని, వీటితో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

‘‘బీసీ కులాలు ప్రధానంగా వృత్తిదారుల కుటుంబాలు. వారు చేసే పని మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. వారు లేకుంటే సమాజం ఈ పరిస్థితిలో ఉండదు. రజకులు బట్టలు ఉతకకపోతే పరిశుభ్రంగా ఉండడం సాధ్యం కాదు. నాయీ బ్రాహ్మణులు క్షవరం చేయకుంటే మనుషులు గుడ్డేలుగుల్లా ఉంటారు. మేదరులు అల్లిన వస్తువులు ప్రతీ ఇంట్లో వాడతారు. మేరలు కుట్టిన బట్టలు తొడుక్కుంటాం. కంసాలి, వడ్రండి, కమ్మరి, కుమ్మరి.. ఇలా ప్రతీ కుల వృత్తిదారులు సమాజం కోసమే పనిచేస్తున్నారు. ఆయా పనులు చేయడం వల్ల వారు ఉపాధి పొందుతుండవచ్చు కానీ, వారి కృషి వల్ల మానవ సమాజం ఉన్నతంగా బతుకుతున్నది. కాబట్టి యావత్ సమాజం కులవృత్తుల వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు ఇప్పటికే చేపట్టింది. భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. సమాజంలో సగభాగం ఉన్న బీసీ కులాల వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి, ఆయా కులాల్లో పేదరిక నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి జరగాలి. బీసీలలో ప్రతీ కులానికి ఓ ప్రత్యేక పని, ప్రత్యేక జీవనం ఉన్నాయి. దానికి అనుగుణంగానే కార్యక్రమాల రూపకల్పనలో కూడా వైవిధ్యం ఉండాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

‘‘గొల్ల, కుర్మల కోసం రూ.4 వేల కోట్ల వ్యయంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అది దిగ్విజయంగా అమలవుతున్నది. రూ.వెయ్యి కోట్ల వ్యయంతో చేపల పెంపకం కార్యక్రమం చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటున్నాం. రూ.1200 కోట్ల వ్యయంతో నేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నాం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, కుమ్మరులు, పంచకర్మల కోసం ప్రత్యేకంగా పథకాలు రూపొందించాం. ఇంకా సంచార జాతులు, ఇతర వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్పొరేషన్ ద్వారా అత్యంత వెనుకబడిన కులాల్లోని కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కార్యక్రమాల రూపకల్పన జరగాలి. లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రతీ ఏటా 60 నుంచి 70 వేల కుటుంబాలను ఆదుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘విశ్వ బ్రాహ్మణుల్లో ప్రధానంగా పంచకర్మలున్నాయి. కుల వృత్తులను ఆధారం చేసుకుని బతుకుతున్నారు. వారికి అవసరమైన పనిముట్లు, ఆర్థిక సహకారం అందించాలి. గ్రామీణ, ప్టటణ, నగర ప్రాంతాల్లోని రజకులకు వారి వారి అవసరాలను, పని విధానాన్ని బట్టి కార్యక్రమాలు రూపొందించాలి. దోబీ ఘాట్ల నిర్మాణం, డయింగ్ మిషన్ల పంపిణీ, ఇంకా అవసరమైన పెట్టుబడి తదితరాలు సమకూర్చాలి. నాయీ బ్రాహ్మణులకు నవీన క్షౌరశాలలు ఏర్పాటు చేయాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నాయీ బ్రాహ్మణులకు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. దానికి తగినట్లు ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల సెలూన్లకు అవసరమైన సాయం అందించాలి. అనేక సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలున్నాయి. అందులో కొందరు ఇంకా సంప్రదాయ కుల వృత్తులు చేసుకుంటున్నారు. కొన్ని కులాలు అంతరించాయి. వారు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహకారం అందించాలి. ప్రతీ ఏటా బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయించుకుంటాం. ఈ ఏడాది వెయ్యి కోట్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది ఇంకా పెంచుతాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రతీ బీసీ కులాల్లోని కుటుంబాలకు వ్యక్తిగతంగా సాయం అందే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే కార్యక్రమాలు రూపొందించి, వచ్చే నెల నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ప్రభుత్వాలు పేరుకు కొన్ని పథకాలు ప్రవేశ పెట్టాయని, అవేవీ బీసీల జీవితంలో మార్పు తేలేకపోయాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, బీసీ కులాల వారి జీవితంలో నిజమైన మార్పు రావాలని సీఎం ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో మంత్రులు జోగు రామన్న, టి.హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భూమ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వి.లక్ష్మికాంతరావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.