బహుముఖ ప్రజ్ఞాశాలి జాహ్నవి

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.. ఈ నానుడి జాహ్నవికి చక్కగా సరిపోతుంది. మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీ చెందిన జాహ్నవి బహుముఖ ప్రజ్ఞాశాలి.  స్థానిక కర్మ పాఠశాలలో ఏడో తరగతి చదువున్న ఈ చిన్నారి ఏదైనా పాటను ఒకసారి విన్నదంటే  అవలీలగా పాడుతుంది. అలాగే డైలాగును కూడా చక్కగా అప్పజెబుతుంది. వివిధ భాషలలో మిమిక్రీతో ఆకట్టుకుంటోంది.

జాహ్నవి 2వ తరగతి నుంచే సంగీతంపై ఆసక్తి చూపేది. అప్పటినుంచే పాటలను, డైలాగులను అనుకరించే ప్రయత్నం చేసింది. తెలుగు ఇంగ్లీషు,హిందీతో పాటు తమిళ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, ఉర్దూ, అరబిక్, గుజరాతీ, పంజాబీ, లంబాడి ఇలా చాలా భాషలలో ఏ పాటనైనా ఒక్కసారి వింటే అలాగే పాడడం జాహ్నవి ప్రత్యేకత.  ఆయా భాషల సినిమాల్లోని డైలాగులను కూడా అవే స్వరాలతో అప్పగిస్తుంది.

మిమిక్రీలో కూడా జాహ్నవి రాణిస్తోంది.  రాజకీయ నాయకులు, సినీ నటులను అనుసరిస్తుంది. గత ఏడాది ఓ సినిమాలో అతిధి పాత్రలో నటించి మెప్పించింది. తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. జాహ్నవి సంగీతంతో పాటు చదువుల్లోనూ ప్రతిభ చూపుతోంది.  జిల్లా యువజనోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పలు ప్రదర్శనలిచ్చి బహుమతులు గెలుచుకుంది.

సంగీతంపై ఎక్కువ మక్కువ ఉన్న జాహ్నవికి హిందుస్థానీ కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఆరేళ్ల వయస్సులోనే జాహ్నవి ప్రతిభ గుర్తించి ప్రోత్సాహస్తున్నామని, సంగీతాన్ని కూడా నేర్పిస్తున్నామని, భవిష్యత్తులో సింగర్‌ అయ్యే అవకాశముందని తల్లిదండ్రులు చెబుతున్నారు.ఏకసంతాగ్రహి అయిన జాహ్నవి ప్రతిభ పట్ల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నారు. మంచిర్యాల వండర్‌ కిడ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.