బతుకమ్మ సంబురాలకు జాగృతి సహకారం

రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే బ‌తుక‌మ్మ పండుగ విజ‌య‌వంతానికి తెలంగాణ జాగృతి స‌హ‌కారం అంద‌జేస్తుంద‌ని ఆ సంస్థ అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. ఈ నెల 26న హైద‌రాబాద్ ఎల్‌బి స్టేడియంలో జ‌రిగే మ‌హా బ‌తుక‌మ్మ వేడుక‌ను విజ‌య‌వంతం చేసేందుకు తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు కృషి చేస్తారని చెప్పారు. మ‌హా బ‌తుక‌మ్మలో పాల్గొనేందుకు మ‌హిళలు వేలాదిగా త‌ర‌లిరావాల‌ని క‌విత  పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆమె ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

పూల‌పండుగ ప‌రిమ‌ళాల‌ను, విశిష్ట‌త‌ను ప్రపంచానికి తెలియ‌జేసేందుకు, తెలంగాణ‌కే ప‌రిమితమైన బ‌తుక‌మ్మ పండుగ‌ను ఖండాంత‌రాల‌కు వ్యాపింప‌జేసేందుకు తెలంగాణ జాగృతి చేసిన విశేష కృషి అంద‌రికీ తెలిసిందేన‌ని కవిత అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుండి రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర పండుగగా నిర్వ‌హిస్తోందని కవిత గుర్తుచేశారు. తెలంగాణ జాగృతి కూడా సంబ‌రాల్లో పాలుపంచుకుంటూ, విజ‌య‌వంతం చేస్తుందన్నారు.

సాంస్కృతిక శాఖ ఇత‌ర రాష్ట్రాలు, విదేశాల్లో నిర్వ‌హించే బ‌తుక‌మ్మ సంబురాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు విజ‌య‌వంతం చేస్తార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు.