బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు

ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన సమీక్ష జరిపారు. బతుకమ్మ పండుగ నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని చెప్పారు.

ఈ నెల 26న దాదాపు 35 వేల మంది మహిళలతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ నెల 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు బతుకమ్మలను హుస్సేన్ సాగర్ లో వదలడానికి ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం వంటి పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

జిల్లాల్లో కూడా బతుకమ్మ పండుగ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పారు. తెలుగు ప్రజలు ఉండే వివిధ రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ను సీఎస్ ఆదేశించారు.

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచారి అన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి వినూత్నంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

బతుకమ్మ పండుగతో తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. గతానికంటే భిన్నంగా ఈసారి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ సెక్టార్లకు చెందిన మహిళలను ఒక్కో రోజు పాల్గొనే విధంగా కార్యక్రమాలు రూపొందించామని వెల్లడించారు. ఈ నెల 26న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ ఉత్సవం నిర్వహిస్తామన్నారు. 28న సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నెక్లేస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించి ట్యాంక్ బండ్ లో బతుకమ్మలను వదులుతామన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పర్యాటక-సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, హెచ్ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జీహెచ్ఎంసీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.