ఫుల్ జోష్ లో టీబీజీకేఎస్ ప్రచారం

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం  ఫుల్ జోష్ లో సాగుతోంది.  కోల్‌ బెల్ట్ ఏరియాలో టీబీజీకేఎస్ ప్రచారంతో దూసుకుపోతున్నది.  సింగరేణిపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడంతో టీబీజీకేఎస్ క్యాంపెయిన్ కు మరింత ఊపు వచ్చింది. ప్రజాప్రతినిధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్మికుల సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్‌ కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పలు జాతీయ కార్మిక సంఘాలకు చెందిన  నేతలు టీబీజీకేఎస్‌ లో చేరారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో వార్ వన్‌ సైడే అన్నారు కొప్పుల ఈశ్వర్‌. టీబీజీకేఎస్ ధాటికి జాతీయ కార్మిక సంఘాల అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారానికి విశేష స్పందన లభించింది. సీఎం కేసీఆర్ తోనే వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని నేతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాలకు చెందిన కార్మికులు టీబీజీకేఎస్ లో చేరారు. టీబీజీకేఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఎన్‌టీయూసీ శాఖ టీబీజీకేఎస్‌ లో విలీనమైంది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జాగృతి అధికార ప్రతినిధి కుమారస్వామి సమక్షంలో టీఎన్‌టీయూసీ నేతలు టీబీజీకేఎస్‌ లో చేరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి సంఘంలోకి స్వాగతించారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని సంఘంలో చేరిన నేతలంతా ప్రతినబూనారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ లో టీబీజీకేఎస్‌ లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో పలు సంఘాలకు చెందిన కార్మిక నాయకులు టీబీజీకేఎస్‌ లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఐదో తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులంతా బాణం గుర్తుకే ఓటేయాలని ఆయన కోరారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో కొమ్రం  భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంబరాలు హోరెత్తాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఖైరిగూడ, డొర్లి ఓపెన్ కాస్ట్ గని కార్మికులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం సీఎం కేసీఆర్కే సాధ్యమవుతుందన్నారు కార్మికులు. బెల్లంపల్లి డివిజన్లో టీబీజీకేఎస్‌ ను గెలిపించి కేసీఆర్‌ కు దసరా కానుకగా ఇస్తామన్నారు.