ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి వయో పరిమితి పెంపు

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్(ఎఫ్ఆర్ఓ) ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయో పరిమితిని మూడు సంవత్సరాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు టీఎస్పీఎస్సీకి లేఖ రాశారు. 28 సంవత్సరాల వయస్సు నిర్ణయం వల్ల తాము ఎఫ్ఆర్ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేయలేక పోతున్నామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి రామన్న వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ వయో పరిమితిని 28 నుంచి 31 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఆన్ లైన్ దరఖాస్తు గడువును పెంచాలని టీఎస్పీఎస్సీకి అధికారులు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు నిరుద్యోగ అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు.