ప్రెసిడెంట్ మెడెల్ అందుకున్న డీఐజీ రూప

కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ఏఐఏడీఎంకే నాయకురాలు శశికళ రాజభోగమేలుతున్నారని సంచలన ప్రకటనలు చేసి పత్రికలకు ఎక్కిన ఆ రాష్ట్ర జైళ్లశాఖ మాజీ డీఐజీ డీ రూప రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా ఈ పతకాన్ని అందజేశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు కోర్టు జైలు శిక్ష విధించగా ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలు సిబ్బంది శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని, ఆమె జైలులో ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారని పేర్కొంటూ రూప ఉన్నతాధికారులకు ఓ నివేదికను అందజేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె పత్రికల్లోకెక్కారు. అనంతరం ఆమెను జైళ్లశాఖ నుంచి మరో విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది.