ప్రియుడే హంతకుడు!

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్యకేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడే ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. పెళ్లి చేసుకొమ్మని చాందిని ఒత్తిడి చేస్తుండడంతోనే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు చెప్పాడని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య వెల్లడించారు.  పథకం ప్రకారమే ఆమెను అమీన్‌ పూర్‌ గుట్టకు తీసుకెళ్లి హత్య చేశాడని చెప్పారు. ఘటన సమయంలో ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మదీనగూడలోని అపార్టుమెంట్‌ లో నివాసం ఉంటున్న చాందిని బోయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మదీనగూడలోని సత్యనారాయణ ఎన్‌ క్లేవ్‌ లో ఉంటున్న హోల్‌ సేల్‌ బట్టల వ్యాపారి కిషోర్‌ జైన్‌ కుమార్తె చాందిని జైన్‌. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి, తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత నిన్న (12వ తేదీ) అమీన్‌ పూర్‌ గుట్టల్లో ఆమె శవం కనిపించింది.

చాందిని హత్యపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన రోజు చాందిని ఆమె బోయ్ ఫ్రెండ్ తో కలిసి ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. చాందిని సెల్‌ ఫోన్‌ కాల్ డేటా ఆధారంగా పలువురు అనుమానితుల్ని విచారించారు. ఆమె స్నేహితుల్ని ప్రశ్నించారు. చాందిని మృతదేహం అమీన్ పూర్ గుట్టలో దొరకడంతో అటువైపు వెళ్లే మార్గాల్లో ఉన్న సీసీటీవీల ఫుటేజీని పరిశీలించారు. అందులో చాందినిని వెంటబెట్టుకొని అతను గుట్టల్లోకి వెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. అతను చాందినిని అమీన్‌ పూర్‌ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

చాందిని హత్య కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. అరెస్ట్ చేసిన చాందిని బోయ్ ఫ్రెండ్ ని వెంటపెట్టుకొని సంఘటన స్థలానికి వెళ్లి క్రైం సీన్ రీ కన్‌ స్ట్రక్ట్ చేశారు.  హత్య చేయడానికి దారి తీసిన కారణాలను అతన్ని అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలంలో తగిన ఆధారాలు కూడా సేకరించారు. పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి చేయడం వల్లే తాను హత్య చేయాల్సి వచ్చిందని ఆమె బోయ్ ఫ్రెండ్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అమీన్ పూర్ గుట్టల్లోకి వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మాటమాట పెరిగి చాందిని చున్నీని గొంతుకు బిగించి చంపినట్టు చెప్పాడని వెల్లడించారు. హత్య తర్వాత చాందిని మృతదేహాన్ని గుట్టల్లో వదిలేసి, ఆమె సెల్ ఫోన్, వస్తువులు చెరువులో పడేసి.. వచ్చిన దారిలో కాకుండా మరోదారిలో అతను వెళ్లిపోయాడని వివరించారు. చాందిని హత్య జరిగిన సమయంలో తాను క్రికెట్ ఆడుతున్నానని అతను అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడని, అన్ని ఆధారాలు చూపించేసరికి నిజం చెప్పక తప్పలేదన్నారు. చాందిని, ఆమె బోయ్ ఫ్రెండ్ అమీన్ పూర్ గుట్టల్లోకి వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు వారి తల్లిదండ్రులకు చూపిస్తే నిర్ధారించారని సీపీ సందీప్ శాండిల్య వివరించారు.