మోడీజీ.. మెట్రోరైల్‌ ప్రారంభానికి రండి!

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ మొదటి దశను నవంబర్‌లో ప్రారంభించేందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం కేసీఆర్ కోరారు. నవంబర్‌ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో అదే సమయంలో మెట్రోరైల్‌ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాశారు. రూ.15వేల కోట్ల వ్యయంతో ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మెట్రోరైల్‌ను కేసీఆర్‌ అభివర్ణించారు.

మెట్రోరైల్‌ను మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల వేర నిర్మిస్తున్నారు. మొదటి దశలో మియాపూర్‌-అమీర్‌పేట మార్గంలో 13 కిలోమీటర్లు, అమీర్‌పేట-నాగోల్‌ మార్గం 17 కిలోమీటర్లు పూర్తయింది. స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తయింది. మిగిలిన పనులు శరవేగంగా చేపడుతున్నారు. ట్రయల్‌రన్‌ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. భద్రతా పరమైన అనుమతులు కూడా వచ్చాయి. ఈ మొత్తం 30 కిలోమీటర్ల మొదటి దశ మెట్రోరైల్‌ను నవంబర్‌లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్న ప్రభుత్వం.. ఆయన్ని ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. ఈ లేఖను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ లో పోస్టు చేశారు.