ప్రగతి పథంలో పరుగులు పెడుతున్న హెచ్ఎండీఏ

టీఆర్ఎస్ పాలనలో హెచ్ఎండీఏ పరిధిలో ప్రగతి పరుగులు పెడుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో హెచ్ఎండీఏ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. భూములను వేలం వేసి దాదాపు రూ.2,700 కోట్లను ప్రభుత్వ ఖజానాలోకి చేర్చాయి. అంతేగానీ అభివృద్ధిపై దృష్టిసారించలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేసిన సొమ్మును.. ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధికే వెచ్చించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో సంస్థ పరిధిలో 1.71 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 60 శాతానికి పైగా దరఖాస్తులకు అధికారులు పరిష్కారం చూపారు. తద్వారా సంస్థకు రూ.400 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నిధులను సంస్థ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వెచ్చించాలని ప్రభుత్వం హెచ్‌ఎండీఏను ఆదేశించింది. దీంతో సంస్థ పరిధిలో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు.

సీఎం కేసీఆర్ పాలనలో హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఏడు జిల్లాల్లోని 55 మండలాలు, 849 గ్రామాల పరిధి కలిపి మొత్తం 7,257 చదరపు కిలోమీటర్ల మేర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.  సర్కార్ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు, డ్రైనేజీలు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.10 కోట్లు, పటాన్‌చెరులో రూ.3 కోట్లతో రహదారుల విస్తరణ, మోరీల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గత వేసవిలో పనులు మొదలు కాగా ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తయ్యాయి. తాజాగా భువనగిరి మున్సిపాలిటీపై దృష్టి సారించారు. స్థానికంగా వచ్చిన అభ్యర్థనల మేరకు హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు రూ.15 కోట్లు కేటాయించారు. రోడ్లు, డ్రైనేజీ, సివరేజీ ట్రిట్‌మెంట్ ప్లాంట్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. సంగారెడ్డి టౌన్‌లో పోతిరెడ్డిపల్లి గ్రామం చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు 5.4 కి.మీ మేర ప్రధాన రహదారి విస్తరణ పనులు రూ.8.79 కోట్లతో చురుగ్గా సాగుతున్నాయి. రూ.3.15 కోట్లతో 4.5 కి.మీల మేర గ్రానైట్ రాయితో డివైడర్లు, రూ.1.95 కోట్లతో లైటింగ్ పనులు జరుగుతున్నాయి. పచ్చదనం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 శాతం పనులు పూర్తయ్యాయి. పటాన్‌చెరులోని అమీన్‌పూర్ గ్రామంలో రూ.3 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఐడీఏ బొల్లారం వరకు 0.7 కి.మీ మేర రోడ్ల పునరుద్ధరణ, మాధవపురిహిల్స్ రోడ్-పీజేఆర్ కాలనీలో 0.9 కి.మీ, బాచుపల్లి పీవోడబ్ల్యూ రోడ్ -సన్‌వే ఓపర్స్ 0.7 కి.మీ, అమీన్‌పూర్-కిష్ణారెడ్డిపేట 2.2 కి.మీలు, అమీన్‌పూర్-గోల్డెన్‌ఫామ్స్ కి.మీ, గోల్డెన్‌ఫామ్స్- ఎన్‌ఎస్‌ఎల్ కాలనీ 0.58 కి.మీ మేర రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా భువనగిరికి నిధులు కేటాయించడంతో త్వరలో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి సమగ్ర ప్రణాళికలతో హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి జోరందుకుంది.