పునర్వ్యవస్థీకరణపై శివసేన అసంతృప్తి

కేంద్రమంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ మిత్రపక్షం శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీకి మద్దతు అవసరమైనప్పుడు మాత్రమే ఎన్డీయేలోని ఇతర పార్టీలు గుర్తుకొస్తాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ విమర్శించారు. ఎన్డీయే అనేది ఎప్పుడో చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అనేది కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు లేదా పార్లమెంట్‌లో మద్దతు అవసరమైనప్పుడు మాత్రమే తాము గుర్తొస్తామని విమర్శించారు. తాము అధికారం కోసం, పదవుల కోసం పాకులాడడం లేదని, పునర్వ్యవస్థీకరణకు వేర్వేరు రాజకీయ కారణాలు ఉంటాయన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.