పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసే ఇల్లు లేని, అర్హత ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో అవసరమైతే ప్రత్యేకంగా కోటా ఇచ్చే అంశాన్ని భవిష్యత్తులో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికుల సంఘాలతో పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కార్మికుల సమస్యలను తెలుసుకున్న మంత్రి కేటీఆర్, వారు అడగకున్నా కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక హెల్త్ కార్డు తీసుకుని వచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో కార్మికులతో పనిచేయించుకుంటే ఆయా కమిషనర్లే బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి సంఘటనలను నేరుగా తనకు, తన కార్యాలయానికి సమాచారం ఇస్తే వెంటనే ఆయా కమిషనర్లను సస్పెండ్ చేస్తామని మంత్రి కేటీఆర్ కార్మికులకు తెలిపారు. కార్మికుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, వారు నగరానికే పని చేయాలని, అధికారులకు, ప్రజాపత్రినిధులకు కాదని స్పష్టం చేశారు. కార్మికులకు అవసరమైన సేఫ్టీ ఎక్విప్ మెంట్ ఇచ్చామని, అవసరమైనంత మేరకు సరఫరా చేస్తామని తెలిపారు. కానీ, ఈ సామగ్రి వాడేలా కార్మికులను చైతన్యపరచాలని కోరారు.

తమకు వేతనాలు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాల కల్పన, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సమాన పనికి సమాన వేతనమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు, సేఫ్టీ ఎక్విప్ మెంట్ వంటి పలు డిమాండ్లను మంత్రి దృష్టికి కార్మికులు తీసుకుని వచ్చారు. తెలంగాణలో అన్ని శ్రామిక వర్గాలకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు. పట్టణాల్లో పరిశుభ్రత కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులను దేవుళ్లతో సమానంగా సీఎం కేసీఆర్ పోల్చారని, ఆయనకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపైన పూర్తి అవగాహన, సానుభూతి ఉందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల  సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఆర్ధిక పరిపుష్టి ఉన్న మున్సిపాలిటీల్లో జీతాలు పెంచినా ఎలాంటి ఇబ్బంది ఉండదని, కానీ నగర పంచాయతీలు, చిన్న మున్సిపాలిటీల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చిస్తామన్నారు మంత్రి కేటీఆర్. జీతాలు పెంచితే పురపాలక శాఖపైన అదనపు ఆర్థిక భారం ఎంత పడుతుందో తెలిపేలా ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈఎస్ ఐ, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలు చిత్తశుద్ధితో అమలు చేస్తామని కార్మిక నాయకులకు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు విషయంలో కొంత సమయం కావాలని కోరారు. కొన్ని నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలివ్వని మున్సిపాలిటీల కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు అవసరమైన మేరకు సహకరిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ శాఖాధికారులు పాల్గొన్నారు.