పరుగులు తీస్తున్న కృష్ణానది  

భారీ వర్షాలకు కృష్ణవేణి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరదనీరు.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు తరలి వస్తున్నది. నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మొత్తం 16 స్పిల్ వే గేట్లను ఎత్తి, దిగువన ఉన్న శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు. శ్రీశైలానికి 1.89 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. తుంగభద్ర నదికి కూడా వరద పోటు పెరుగడంతో ఆర్డీఎస్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువన ఉన్న సుంకేసులకు చేరుతున్నది.

జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం అర్ధరాత్రి నుంచే భారీ ఎన్ ఫ్లో వస్తున్నది. దీంతో శనివారం ఉదయం 9 గేట్లను ఒక  మీటర్ ఎత్తి, 37వేల 710 క్యూసెక్కులు, పవర్ యూనిట్‌ లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 40 వేల క్యూసెక్కులు నదిలోకి వదిలారు. అప్పటికి 84, 510 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 84వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లో నమోదైంది. అనంతరం క్రమంగా ఇన్‌ ఫ్లో పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం లక్షా 13 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో పది గేట్లను రెండు మీటర్ల ఎత్తున, రెండు గేట్లను మీటర్‌, మరో రెండు గేట్లను అర మీటర్‌ ఎత్తి.. 85వేల 140 క్యూసెక్కులు నదిలోకి వదిలారు. మరోవైపు పవర్ హౌజ్ నుంచి నిరాటంకంగా 40 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో శనివారం రాత్రి వరకు లక్ష 29వేల 323 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగింది. దీంతో 16 స్పిల్ వే గేట్ల నుంచి యధాతథంగా నీటిని విడుదల చేస్తున్నారు.

అటు కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద భారీగా నమోదవుతోంది. పది రోజుల కిందటివరకు వట్టిపోయిన తుంగభద్ర నది ప్రస్తుతం వస్తున్న వరద నీటితో జలకళను సంతరించుకున్నది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి 1.18 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న సుంకేసుల జలాశయానికి తరలి వెళ్తున్నది. దీంతో సుంకేసుల బరాజ్ నుంచి 15 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టపై 4 అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగుతున్నది.

శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం లక్షా 88 వేల 878 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వచ్చి చేరుతున్నది. ఇందులో జూరాల నుంచి లక్షా 8 వేల 998 క్యూసెక్కులు.. తుంగభద్ర నుంచి 79, 880 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉన్నది. శనివారంఉదయం వరకు ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు పైగా ఉండగా.. సాయంత్రానికి కాస్త తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను శనివారం సాయత్రం 840 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయి సామర్ధ్యం 215.708 టీఎంసీలకుగాను ప్రస్తుతం 61.797 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి హంద్రీనీవాకు వెయ్యి 680 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది.