పరీక్షలు ఉమ్మడిగా, ఫలితాలు వేగంగా!

ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు టీఎస్పీఎస్సీ వడివడిగా అడుగులు వేస్తోంది. పెద్దఎత్తున విడుదలవుతున్న ఉద్యోగాల భర్తీ ప్రకటనలు, అనేక దఫాలుగా సాగుతున్న పరీక్షల వల్ల ఒక్కో నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు తీసుకుంటున్న సమయంపై టీఎస్‌పీఎస్సీ దృష్టిసారించింది. పరీక్ష ముందు, తర్వాతి ప్రక్రియలో జాప్యాన్ని నివారించే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. అర్హత కేటగిరీలో ఉమ్మడిపరీక్ష నిర్వహించడం, పోస్ట్ ఎగ్జామినేషన్ (పరీక్ష నిర్వహణ తర్వాతి) దశలో మరింత వేగం పెంచడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సహా సభ్యులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

వివిధ విభాగాల్లో ఇప్పటివరకు భర్తీ చేసిన కొలువుల ప్రక్రియను కమిషన్ ఇటీవల సమీక్షించింది. ఈ క్రమంలో పలు ఉద్యోగాలకు అర్హతపరీక్షలో సారూప్యత ఉన్నదని గమనించింది. అయినప్పటికీ కొన్ని ఉద్యోగాల విషయంలో ఒక్కో విభాగానికి ఒక్కో పరీక్ష నిర్వహించడం వల్ల ఎక్కువ సమయం పడుతున్నదని తేల్చింది.

ఈ నేపథ్యంలో అర్హత దశలో ఉమ్మడి పరీక్ష నిర్వహించి.. తదుపరి దశలో సంబంధిత అంశాల్లో జ్ఞానాన్ని పరీక్షించేలా పరీక్ష ప్యాట్రన్ ఉండటం వల్ల రెండు లాభాలు ఉన్నట్లు గుర్తించింది. అభ్యర్థులకు రెండురకాల పరీక్షలు రాయడం తప్పిపోవడంతోపాటు త్వరితగతిన ఆ ప్రక్రియను పూర్తిచేయడం వీలవుతుంది. ఈ కీలక అంశాన్ని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ.. ఇటీవల నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్షలో ఈ విధానాన్ని అవలంభించింది. సివిల్, మెకానికల్ విభాగంలో అధికారులు ఉమ్మడి పరీక్షను నిర్వహించారు. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అంశాలపై ఉమ్మడిగా.. సివిల్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్ పరీక్షలను వేర్వేరుగా నిర్వహించడాన్ని అభ్యర్థులు సైతం స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ వంటి విభాగాల్లోని కొలువులను ఇదే రీతిలో భర్తీ చేసేలా టీఎస్‌పీఎస్సీ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

అలాగే పరీక్షలు పూర్తయిన తర్వాతి దశలో తుది ఫలితాలు వెలువడేందుకు అధిక సమయం పడుతున్న విషయంపై కూడా కమిషన్ దృష్టిసారించినట్టు సమాచారం. ఓఎంఆర్ స్కానింగ్, ర్యాంకింగ్ కోసం మాన్యువల్, టెక్నికల్ జాబితా సిద్ధం చేయడంపై కూడా దృష్టి పెట్టింది. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం, ఇతరత్రా ప్రతిపాదనలపై కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తున్నది.