పరస్పర సహకారంతో బలమైన వ్యవస్థ

పరస్పర సహకారంతో బ్రిక్స్‌ దేశాలు ఓ బలమైన వ్యవస్థను అభివృద్ధి చేశాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనాలోని షామన్‌ లో నిర్వహిస్తున్న బ్రిక్స్‌ దేశాల కూటమి ప్లీనరీ, బిజినెస్ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రపంచం అనిశ్చితి వైపు అడుగులేస్తున్న ప్రస్తుత తరుణంలో… బ్రిక్స్ దేశాలు అభివృద్ధి వైపునకు వెళ్లేందుకు ఈ కూటమి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

భారత్ లో తమ ప్రభుత్వం జి.ఎస్.టి రూపంలో అతిపెద్ద పన్ను సంస్కరణ చేపట్టిందని ప్రధాని మోడీ చెప్పారు. షామన్ లో బ్రిక్స్ దేశాల మధ్య జరిగిన బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో మోడీ ప్రసంగించారు. భారత్ లో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ సంస్థల కారణంగా ఆర్థిక అభివృద్ధి పెరిగిందన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి అవసరమని చెప్పారు.

అంతకుముందు జరిగిన ప్లీనరీ సమావేశంలోనూ భారత వైఖరిని మోడీ కూటమి దేశాల ముందు ఉంచారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాదమే ప్రధాన సమస్యగా మారిందన్నారు. పరోక్షంగా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రేరిపిస్తోందని ప్రస్తావించారు. అన్ని దేశాల మధ్య శాంతి, అభివృద్ధి కోసం పరస్పర సహకారం అవసరమని, ఆర్ధిక, వాణిజ్య సహకారం బ్రిక్స్ దేశాలకు పునాది అన్నారు ప్రధాని. బ్యాంకింగ్, విద్యుత్, వాతావరణ మార్పులు, వైద్యం, పారిశుద్ధ్యంపై బ్రిక్స్ దేశాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పేదరిక నిర్మూలనకు బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారం చాలా ముఖ్యమన్నారు మోడీ.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కు చెందిన దేశాధినేతలు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోడీకి, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానం పలికారు. సదస్సులో భాగంగా అన్ని దేశాల నేతలతో అధినేతలతో ప్రధాని విడివిడిగా మర్యాద పూర్వకంగా కలిశారు. ఐతే, డొక్లామ్ వివాదం తర్వాత ప్రధాని మోడీ చైనా వెళ్లటంతో ఇరు దేశాల అధినేతల సమావేశంపై ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ మంగళవారం సమావేశం కానున్నారు.