నేతన్నలకు చేతినిండా పని

తెలంగాణ రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. వారికిపుడు చేతినిండా పని దొరుకుతున్నది. అంతేకాకుండా వారికి నెలకు 15 వేల వరకు వేతనం అందించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం చేనేత కార్మికులు నేసిన 80కోట్ల విలువైన వస్త్రాలను, గత రెండేండ్లలో సిరిసిల్ల మరమగ్గాల ద్వారా నేసిన 193 కోట్ల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో బతుకమ్మ చీరెల కోసం ఇచ్చిన 84 కోట్ల ఆర్డర్లు, సంక్షేమ శాఖల వస్ర్తాల కోసం ఇచ్చిన 12కోట్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల కోసం ఇచ్చిన 83కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లోనూ చేతినిండా పని కల్పించే విధంగా మంత్రి కేటీఆర్  ప్రణాళికలు సిధ్ధం చేశారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాల తయారీ ద్వారా ఎనిమిది నెలల పని లభించనుంది. ఒకేసారి కాకుండా ఏడాది పొడవునా చేనేత కార్మికులకు పని ఉండే విధంగా వార్షిక క్యాలెండర్‌ ను రూపొందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నేత కార్మికుల కష్టాలను దూరం చేసే విధంగా సీఎం కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్‌లో 1200 కోట్లను కేటాయించారు. వారికి కూలీ రేట్లు పెరిగే విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిరిసిల్ల కార్మికులకు నెలకు 15 నుంచి 18 వేల వరకు వేతనాలు లభించే విధంగా కూలీరేట్లు పెంచాలని సీఎం కేసీఆర్  ఆసాములతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చెప్పారు. ఇందుకు అనుగుణంగా యార్న్‌ పై సబ్సిడి, నేతన్నకు చేయూత పథకాలను అమలు చేస్తున్నారు.
ప్రభుత్వశాఖలకు అవసరమైన వస్త్రాలను, యూనిఫాం క్లాత్‌ను సిరిసిల్లలో తయారు చేయించి సరఫరా చేయిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రయోగం విజయవంతమైంది. వచ్చే సంవత్సరం కూడా అమలు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకిచ్చేందుకు సిరిసిల్ల పవర్ లూం ద్వారా 2016-17లో 1.07 కోట్ల మీటర్ల యూనిఫాం క్లాత్‌ ను తయారు చేయించారు. వీటికి ప్రభుత్వం 42.54 కోట్లను చెల్లించింది. ఈ విద్యాసంవత్సరంలో 1.03 కోట్ల మీటర్లక్లాత్‌ కు 40.76 కోట్లను చెల్లించింది. 73.16 లక్షల బతుకమ్మ చీరెలను సిరిసిల్లలో తయారు చేయించారు. వీటికి ప్రభుత్వం 84.52 కోట్లు చెల్లించింది. సిరిసిల్లలో తయారైన ప్రతి చీరెను కొనుగోలు చేసే విధంగా మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన సంక్షేమ, ఎస్సీ అభివృద్ధిశాఖలు, కేజీబీవైలు, కేజీబీవైలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల యూనిఫాంక్లాత్‌ను మరమగ్గాలపైనే తయారు చేయిస్తున్నారు.

2016-17లో ఎస్సీ అభివృద్ధిశాఖ గురుకులాలకు 3.06 లక్షల మీటర్ల క్లాత్‌కు 1.02 కోట్లు, గిరిజనుల గురుకులాలకు 1.54 లక్షల మీటర్ల క్లాత్‌కు 46 లక్షలను చెల్లించారు. 2017-18 లో సంక్షేమ శాఖలన్నంటికి 30.60 లక్షల మీటర్ల క్లాత్‌ను సరఫరా చేయగా 12.61 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. కస్తూర్బాగాంధీ స్కూళ్లవిద్యార్థినులకు 3.04 లక్షల మీటర్ల క్లాత్‌  కు కోటి రూపాయలు ఇచ్చారు. గిరిజన గురుకులాలకు 10.71లక్షల మీటర్ల క్లాత్‌కు 4.83 కోట్లు చెల్లించారు. ప్రసూతి కేంద్రాల్లో మహిళలకు కేసీఆర్ కిట్‌లో ఒక చీరెను కూడా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 1.02లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. వీటికి 1.33 కోట్లను చెల్లించింది.